“తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య” కేంద్ర ప్రభుత్వ అవార్డు

ABN , First Publish Date - 2020-11-21T22:29:10+05:30 IST

ఉత్తమ పనితీరు కనపర్చిన “తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య” (టీఎస్ఎఫ్ సి ఎఫ్) కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది.

“తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య” కేంద్ర ప్రభుత్వ అవార్డు

హైదరాబాద్: ఉత్తమ పనితీరు కనపర్చిన “తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య” (టీఎస్ఎఫ్ సి ఎఫ్) కు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్బంగా శనివారం డిల్లీ లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డ్ ఆధ్వరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  కేంద్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్య శాఖ సహాయ మంత్రి  ప్రతాప్ చంద్ర సారంగి, చేతుల మీదుగా పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి  శాఖ కార్యదర్శి, మత్స్యశాఖ ఇంచార్జి కమిషనర్ అనిత రాజేంద్ర  అందుకున్నారు.


ఉత్తమ పురస్కారముతో పాటు రూ.5 లక్షలు నగదు బహుమతిని అందజేశారు. ఇన్ ల్యాండ్ కేటగిరి ( సముద్ర ఏతర ప్రాంతాలలో మత్స్య రంగ అభివృద్ధి) కేటగిరి క్రింద ఈ అవార్డు లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో,  పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి  శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వరంలో మత్సరంగం అభివృద్దికి అనేక కార్యక్రమాలను చేపట్టింది.


ముఖ్యంగా మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమన్ని దృష్టిలో ఉంచుకొని 2017 సంవత్సరం నుండి రాష్ట్రం లోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను విడుదల చేస్తుంది. ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన ఈ కార్యక్రమం వలన మత్స్య సంపద విరివిగా అభివృద్ధి చెంది మత్స్యకారుల కుటుంబాలకు ఆదాయ వనరుగా తయారైంది. అయితే పట్టిన చేపలను విక్రయించుకోవడానికి, పెద్ద మార్కెట్ లకు సరఫరా  చేయుటకు అవసరమైన రవాణా సదుపాయాలను కల్పించడం ద్వారా మత్స్య రంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మందికి మరింత తోడ్పాటును అందించే ఉద్దేశంతో  ద్వారా సుమారు 747 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు, లగేజి ఆటోలు, ట్రక్ లు వంటి వాహనాలు, వలలు ఇతర పనిముట్లు, సామాగ్రి ని పంపిణీ చేయడం జరిగింది.


దీని ద్వారా 1.15 లక్షల మంది మత్స్యకారులు వ్యక్తిగతంగా లబ్దిపొందారు. దేశంలోనే ప్రప్రధమంగా మన రాష్ట్రంలో చేపట్టబడిన  ఈ కార్యక్రమాన్ని దేశంలోని అనేక రాష్ట్రాల లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అంతేకాకుండా “తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య” ద్వారా ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ఫలితంగా 2019 -20 సంవత్సరంలో 3.14 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి పెరిగి రాష్ట్రంలోని సుమారు  3 లక్షలకు పైగా మత్స్యకార కుటుంబాలకు ఆదాయం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి.


టీఎస్ఎఫ్ సి ఎఫ్ కు జాతీయ స్థాయిలో అవార్డు లభించడం పట్ల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్యశాఖ ఇంచార్జి కమిషనర్  అనిత రాజేంద్ర, ఈ శాఖలో పని చేస్తున్న ప్రతి ఒక్కరిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. ఉద్యోగులు చేసిన కృషి ఇతర శాఖల కు ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని మంత్రి పేర్కొన్నారు.  

Read more