కొత్త సచివాలయ నమూనాకు సీఎం ఆమోదం
ABN , First Publish Date - 2020-07-08T08:35:17+05:30 IST
ప్రస్తుత సచివాలయ భవనాల్ని కూల్చేసి, దాని స్థానంలోనే ఆధునిక హంగులతో కొత్తగా సమీకృత ...

ఆధునిక హంగులతో సమీకృత సచివాలయం
500 కోట్ల ఖర్చు.. 6 అంతస్తులు.. 7 లక్షల చ.అడుగులు
హఫీజ్ కాంట్రాక్టర్ డిజైన్‌కు సీఎం కేసీఆర్ ఆమోదం
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సచివాలయ భవనాల్ని కూల్చేసి, దాని స్థానంలోనే ఆధునిక హంగులతో కొత్తగా సమీకృత సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మించబోతుంది. ఎలాంటి వాస్తు దోషం లేకుండా నిర్మించాలన్నది సీఎం కేసీఆర్ కోరిక. ఇందుకు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. మొత్తం 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దీర్ఘచతురస్రాకారంలో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు. మంత్రుల పేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ కార్యాలయాలు ఉండేలా నిర్మిస్తారు. సీఎం ప్రవేశించడానికి ప్రత్యేక ద్వారం ఉంటుంది. మొత్తంగా 27 ఎకరాల స్థలంలో సమీకృత సచివాలయ భవనం కోసం 20శాతమే వినియోగంచనున్నారు. మిగతా 80శాతం ఖాళీ ప్రదేశంలో ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్పం తంగేడు ఆకారంలో ఫౌంటెయిన్లు, ఒకేసారి 800 కార్లు నిలిచేలా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ పనులు జూలై చివరివారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సచివాలయ భవన నూతన డిజైన్‌ను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ముంబైకి చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించిన డిజైన్‌ను సీఎం ఖరారు చేశారు. దాని నమూనా ఫొటోను సీఎంవో మంగళవారం విడుదల చేసింది. రాజప్రసాదంలా ఉన్న ఈ నమూనా ఆకట్టుకునేలా ఉంది. ఇది వనపర్తిలోని కృష్ణ దేవరాయ పాలిటెక్నిక్ కళాశాల భవన నమూనాను పోలి ఉంది. నాటి రాజుల నుంచి నేటి ప్రముఖుల వరకు ఎంతో మంది ఈ కళాశాలలో చదువుకున్నవారే. అందుకే అలాంటి ప్రశస్తి ఉన్న భవనాన్ని పోలినవిధంగా డిజైన్ ఉండడంతో సీఎం ఓకే చేసినట్లు తెలిసింది.