ఎక్సైజ్‌ రాబడి పెరిగింది

ABN , First Publish Date - 2020-10-12T10:06:56+05:30 IST

ఎక్సైజ్‌ రాబడి పెరిగింది

ఎక్సైజ్‌ రాబడి  పెరిగింది

రెండు త్రైమాసికాల్లో 10.74 శాతం పెరుగుదల

ఆరు నెలల్లో వచ్చిన రాబడి రూ.11,849 కోట్లు

మొదటి త్రైమాసికం కంటే రెండో త్రైమాసికంలో 54.2ు వృద్ధి

లిక్కర్‌ రేట్ల పెంపు, సరిహద్దు షాపుల్లో విక్రయాలే కారణాలు


హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్సైజ్‌ రాబడి గణనీయంగా పెరిగింది. ఏకంగా 10.74 శాతం పెరుగుదల నమోదైంది. ఈ రెండు త్రైమాసికాల్లోనే ఖజానాకు రూ.11,849.56 కోట్ల ఆదాయం సమకూరింది. మే నెలలో వైన్‌ షాపులకు అనుమతి ఇవ్వడంతో పాటే లిక్కర్‌ రేట్లను 11 నుంచి 16 శాతం వరకు పెంచడంతో వృద్ధి నమోదైంది. పైగా... ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్‌ రేట్లు విపరీతంగా ఉండడంతో అక్కడి మందుబాబులు రాష్ట్రంలోని సరిహద్దు వైన్‌ షాపుల్లో మందును కొనుగోలు చేస్తుండడం కూడా పెరుగుదలకు ఊతమిస్తోంది. మొదటి త్రైమాసికంలో మద్యం విక్రయాలపై లాక్‌డౌన్‌ దెబ్బ కొట్టినా రెండో త్రైమాసికంలో అమ్మకాలు పెరిగాయి. ప్రస్తుతం బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, క్లబ్బులు, టూరిజం హోటళ్లు కూడా తెరుచుకోవడంతో మూడో త్రైమాసికంలో మరింత రాబడి పెరుగుతుందని ఎక్సైజ్‌ వర్గాలు భావిస్తున్నాయి. వ్యాట్‌ మినహా కేవలం ఎక్సైజ్‌ రాబడే 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు వరకు 6 నెలల కాలంలో రూ.11,489.56 కోట్లు వచ్చింది. అదే 2019-20 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు వరకు రూ.10,699.47 కోట్లు మాత్రమే వచ్చాయి. కరోనా కారణంగా  ఏప్రిల్‌-మే-జూన్‌ త్రైమాసికంలో కేవలం రూ.4661.52 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది. రెండో త్రైమాసికం జూలై-ఆగస్టు-సెప్టెంబరులో రూ.7188.14 కోట్లు వచ్చాయి.  రెండో త్రైమాసికంలో  రూ.2526.62 కోట్లు పెరిగి 54.20 శాతం వృద్ధి నమోదైంది. మొత్తానికి గతేడాది కంటే ఈ ఏడాది రెండు త్రైమాసికాల్లో ఎక్సైజ్‌ రాబడి 10.74 శాతం పెరగడం కష్ట కాలంలో ప్రభుత్వానికి కొంత ఊరటేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మే 6 నుంచి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాబడి మొదలైంది. దాంతో పాటే ప్రభుత్వం మద్యం, బీరు ఎమ్మార్పీ రేట్లను 11 నుంచి 16 శాతం వరకు పెరిగింది. ఈ రేట్ల పెంపు ఆదాయం పెరగడానికి దోహదపడింది. అంతేకాదు...  ఆంధ్రప్రదేశ్‌కు దరిదాపుల్లో ఉన్న సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, గద్వాల-జోగులాంబ, నల్గొండ వంటి జిల్లాల్లో మద్యం విక్రయాలు పెరిగాయి. ఏపీలో  ప్రీమియం బ్రాండ్లు లేకపోవడం, ధర కూడా ఎక్కువగా ఉండడంతో సరిహద్దుల్లోని ఏపీ ప్రజలు తెలంగాణ మద్యం షాపుల వద్ద బారులు తీరుతున్నారు. 

Updated Date - 2020-10-12T10:06:56+05:30 IST