హైదరాబాద్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ హల్‌చల్‌

ABN , First Publish Date - 2020-10-12T10:03:53+05:30 IST

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ హల్‌చల్‌

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ హల్‌చల్‌

రాజస్థాన్‌ ఏటీఎస్‌ పోలీసుల దాడులు

ఏకకాలంలో ముంబై, జైపూర్‌లో సోదాలు

 గచ్చిబౌలిలో ఏడుగురు బుకీల అరెస్టు

జైపూర్‌లో మరో ఏడుగురికి బేడీలు

నిందితులంతా రాజస్థాన్‌కు చెందినవారే

రూ. 16.50 కోట్ల నగదు స్వాధీనం

మ్యాచ్‌ ఫిక్సింగ్‌లోనూ ముఠా పాత్ర!


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో ఐపీఎల్‌ బెట్టింగ్‌ హల్‌చల్‌ వెలుగుచూసింది. నిఘావర్గాల సమాచారంతో రాజస్థాన్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) పోలీసులు గచ్చిబౌలిలో దాడులు జరిపి.. ఏడుగురు బుకీలను అరెస్టు చేశారు. ఈ ముఠాతో అంతర్జాతీయ, మ్యాచ్‌ఫిక్సింగ్‌ గ్యాంగులకు లింకులు ఉన్నాయా? అనే కోణంలో ఏటీఎస్‌ విచారణ జరుపుతోంది. జైపూర్‌లో ఆదివారం రాత్రి 10 గంటలకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏటీఎస్‌ అదనపు డీజీ అశోక్‌ రాథోడ్‌ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్‌, మ్యాచ్‌ఫిక్సింగ్‌ ముఠాలపై నిఘా వర్గాల ద్వారా ఏటీఎస్‌ పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి జైపూర్‌, ముంబై నగరాలతోపాటు.. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సైబరాబాద్‌ పోలీసుల సాయంతో హైదరాబాద్‌లో ఏడుగురిని, జైపూర్‌లో మరో ఏడుగురిని అరెస్టు చేశారు. ముంబైలో ఉన్న హైదరాబాదీ బుకీలు తప్పించుకున్నారు. ‘‘మరికొందరు నిందితులు, బుకీలు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ ముఠాతో అంతర్జాతీయ బెట్టింగ్‌ రాకెట్లతో లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ఫిక్సింగ్‌ వెనకా ఈ ముఠా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి’’ అని ఏడీజీ అశోక్‌ రాథోడ్‌ తెలిపారు. ఈ విషయాలను సీరియ్‌సగా తీసుకుని, లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. గచ్చిబౌలిలో కన్హయ్యలాల్‌ చాలానీ పేరుతో ఉన్న ఇద్దరు నిందితులతోపాటు.. కేసరీ చంద్‌, రాజేంద్ర కుమార్‌ చాలానీ, చంపాలాల్‌ బేద్‌, జుగల్‌కిశోర్‌, భానూ పాస్వాన్‌ను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ. 16.50 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించి బ్యాంకు ఖాతాలను పరిశీలించాల్సి ఉందని చెప్పారు. 


హైదరాబాదీ బుకీలు ముంబైలో..

ఈ ముఠా పక్కా ప్లాన్‌తో బెట్టింగ్‌లకు పాల్పడుతోందని.. వారు అడ్డాలు మార్చడాన్ని బట్టి, మ్యాచ్‌ఫిక్సింగ్‌ల వెనక ఉన్న విద్రోహశక్తులతో సంబంధాలు ఉండి ఉంటాయని ఏటీఎస్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ లింకులను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన బుకీలంతా.. ఆదివారం నాటి మ్యాచ్‌ల సందర్భంగా జైపూర్‌ నుంచి బెట్టింగ్‌ను ఆపరేట్‌ చేశారు. జైపూర్‌కు చెందిన బుకీలు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చుకున్నారు. హైదరాబాదీ బుకీలు ముంబైలో తిష్టవేసి, బెట్టింగ్‌లు సాగించారు. ఆదివారం మధ్యాహ్నం ఏటీఎస్‌ బృందాలు ఏకకాలంలో దాడులు జరిపినా.. ముంబైలో ఉన్న హైదరాబాదీ బుకీలకు ముందే ఉప్పందడంతో పరారయ్యారు. 



అధునాతన టెక్నాలజీతో..

గచ్చిబౌలిలో జరిపిన దాడుల్లో.. ఏటీఎస్‌ పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నలింగ్‌ రోటర్‌ పరికరాలు, యాంటినాను సీజ్‌ చేశారు. దీనిద్వారా నిందితులు తమ లొకేషన్‌ను విదేశాల్లో ఉన్నట్లుగా మార్చుకునే వీలుంటుంది. వీవోఐపీ (వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌) ద్వారా స్పూఫింగ్‌ నంబర్ల ద్వారా ఫోన్లు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

Updated Date - 2020-10-12T10:03:53+05:30 IST