కొత్త భవనాలు కావాలా?

ABN , First Publish Date - 2020-10-12T10:01:01+05:30 IST

కొత్త భవనాలు కావాలా?

కొత్త భవనాలు కావాలా?

ఉన్నవి సరిపోతాయా..?

ఇరిగేషన్‌ శాఖ పునర్విభజనపై క్షేత్రస్థాయి కసరత్తు షురూ

నాలుగు ఉమ్మడి జిల్లాల్లో పూర్తి

వారంలో పూర్తి.. ప్రభుత్వానికి నివేదిక


హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఇరిగేషన్‌ శాఖ పునర్విభజనపై క్షేత్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. సర్కిళ్లు, డివిజన్లు, సబ్‌ డివిజన్ల వంటి కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలి? వాటికి అవసరమైన భవనాలు ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై అధికారులు దృష్టిని కేంద్రీకరించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేకంగా సమావేశాలను ఏర్పాటు చేసి, చర్చిస్తున్నారు. రాష్ట్రంలో భారీ, మధ్య తరహా, చిన్న నీటిపారుదల విభాగాలుగా ఉన్న ఇరిగేషన్‌ శాఖ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చి జల వనరుల శాఖగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఇరిగేషన్‌ ఆస్తుల లెక్కింపు, భూముల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో 13 సర్కిళ్లుగా ఉన్న శాఖను 19 సర్కిళ్లకు పెంచి, ఒక్కో సర్కిల్‌కు ఒక చీఫ్‌ ఇంజనీర్‌ను బాస్‌గా నియమించే ప్రక్రియ పూర్తి చేశారు. ఈ క్రమంలో గతంలో ఉన్న సర్కిళ్ల పరిధుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాల వారీగా ఎస్‌ఈలతో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. నీటిపారుదల శాఖ పునర్విభజన, శాఖ పేరు మార్పు దస్త్రంపై గత నెల 9న సీఎం కేసీఆర్‌ సంతకం చేశారు. అయితే పునర్విభజనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్ర స్థాయి కసరత్తును చేపట్టడం గమనార్హం. ఈ నెల 7 నుంచి రోజుకో ఉమ్మడి జిల్లా ఇంజనీర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ వంటి జిల్లాల కసరత్తును పూర్తి చేశారు. మరో వారం రోజుల్లో మిగిలిన జిల్లాలవి పూర్తి చేసే అవకాశం ఉంది. వీలైనంత మేరకు ఇప్పుడున్న భవనాలను ఉపయోగించుకునేలా కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేసే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప కొత్త భవనాలను ప్రతిపాదించవద్దని భావిస్తున్నారు. పరిపాలన విభాగం ఈఎన్‌సీ నాగేందర్‌రావు సమక్షంలో కసరత్తు సమావేశాలు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తర్వాత, ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను సమర్పించే అవకాశం ఉంది. 

Updated Date - 2020-10-12T10:01:01+05:30 IST