ఫార్మాసిటీకి జనం వ్యతిరేకం

ABN , First Publish Date - 2020-10-12T09:35:26+05:30 IST

ఫార్మాసిటీకి జనం వ్యతిరేకం

ఫార్మాసిటీకి జనం వ్యతిరేకం

అయినా ఏర్పాటు చేయడం దారుణం.. శాసనసభలో నిలదీస్తా: భట్టి

ఫార్మాసిటీపై ఎన్జీటీలో కేసు వేస్తా: వెంకట్‌రెడ్డి


యాచారం/హయత్‌నగర్‌/కరీంనగర్‌ అర్బన్‌, అక్టోబరు 11: పచ్చటి పంట పొలాల్లో విషాన్ని వెదజల్లే ఫార్మాసిటీ వద్దని జనం మొత్తుకుంటున్నారని, అయినా బలవంతంగా ఏర్పాటు చేయడం దారుణమని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలో ఫార్మాసిటీ ఏర్పాటుకు దొంగ తీర్మానాలతో చర్యలు చేపట్టడంతో పాటు దొడ్డిదారిన నిమ్జ్‌ హోదా దక్కించుకుందని, చరిత్ర పాలకులను క్షమించదన్నారు. ఆదివారం యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మాసిటీ కోసం మూడేళ్ల క్రితం జరిగిన అభిప్రాయ సేకరణ సమయంలో కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను, రైతులను ప్రభుత్వం అరెస్టు చేయించి దొంగపత్రాలు సృష్టించిందని ఆరోపించారు. దీనిపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీ ఇచ్చారు. ఫార్మాసిటీ ఏర్పాటును అడ్డుకునేందుకు తాను నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో కేసు వేస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఫార్మాసిటీపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని స్పష్టం చేయాలని మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  


స్తూపం ఆవిష్కరించిన కాంగ్రెస్‌ నేతలు

మూడేళ్ల క్రితం ఫార్మాసిటీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ జరిగిన ప్రదేశంలో భారీ స్తూపాన్ని భట్టివిక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం తుర్కయంజాల్‌ మునిసిపాలిటిలోని మునగనూర్‌ గ్రామంలో దళితుల భూములు తీసుకోవద్దని స్థానికులు 20 రోజులుగా ధర్నా చేస్తుండగా.. ఆ ప్రాంతానికి వారిద్దరూ వెళ్లి ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో నూతన వ్యవసాయ చట్టం కారణంగా మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సన్నరకాలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దానికి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-10-12T09:35:26+05:30 IST