యూపీని మించిపోయిన తెలంగాణ

ABN , First Publish Date - 2020-10-12T09:34:25+05:30 IST

యూపీని మించిపోయిన తెలంగాణ

యూపీని మించిపోయిన తెలంగాణ

దళితులపై దాడులు పెరిగాయి.. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ను ఓడించాలి: ఉత్తమ్‌

ఉద్యమించకపోతే బతకనివ్వరు: భట్టి


హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): దళితులపై దాడుల్లో తెలంగాణ రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ను మించిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని దళితులంతా ఏకమై సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని, దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్‌ఎ్‌సను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం టీపీసీసీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ప్రకాశం హాల్లో సంకల్పం పేరిట దళితుల ఐక్య కార్యక్రమం నిర్వహించారు. భూములను గుంజుకుంటూ దాడులు, హత్యలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌కు దళితులు ఓటు వేయొద్దని సంకల్పం తీసుకున్నారు. ఉత్తమ్‌ మాట్లాడుతూ.. దళితులపై దాడులను  చూస్తుంటే గుండె బరువెక్కుతోందన్నారు. ఇంత దారుణంగా దాడులు ఎన్నడూ జరగలేదన్నారు.   కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దళితులకు ఇచ్చిన భూములను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో లాక్కుంటోందన్నారు.ఒక్కటై ఉద్యమించకపోతే దళితులకు బతుకు లేకుండా చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ఏఐసీసీ ఎస్సీ విభాగం తెలంగాణ ఇన్‌చార్జి రవీంద్ర దలేవీ, టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్‌ ప్రీతమ్‌ పాల్గొన్నారు. 


బాధితులకు పరామర్శ

రాష్ట్రంలో దాడులకు గురైన దళిత కుటుంబాలను ఉత్తమ్‌ పరామర్శించారు. ఇందిరాభవన్‌లో నిర్వహించిన న్యాయపోరాట వేదికలో  వారిని ఓదార్చారు. గజ్వేల్‌లో 13 కుంటల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసు కోవడంతో బలవన్మరనానికి పాల్పడ్డ బ్యాగరి నర్సింహులు కుటుంబాన్ని పరామర్శించారు. జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డితో మాట్లాడి  న్యాయం చేయాలని కోరా రు. ఖమ్మంలో హత్యాయత్నానికి గురైన బాలిక తల్లిదండ్రులతో సంభా షించారు. అనంతరం  మీడియాతో మాట్లాడుతూ ‘సీఎం నియోజకవర్గంలో దళితుడి భూమిని గుంజుకుంటారా?  కేసీఆర్‌కు దళిత కుటుంబాల ఉసురు తగులుతుంది. భూపాలపల్లి మండలం మల్లారంలో యువకుడు రాజబాబును కొట్టి చంపారు. ఎస్సీ కమిషన్‌ దోషులకే వంతపాడుతోంది’ అని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్‌.. 50 లక్షల జనాభా ఉన్న మాదిగలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, కనీసం బతకనివ్వడంలేదని మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. 

Updated Date - 2020-10-12T09:34:25+05:30 IST