దంపతుల్లో కరోనా చిచ్చు

ABN , First Publish Date - 2020-10-12T09:31:20+05:30 IST

దంపతుల్లో కరోనా చిచ్చు

దంపతుల్లో కరోనా చిచ్చు

భార్య అనుమానాస్పద మృతి


కొణిజర్ల, అక్టోబరు 11: కరోనా సోకి హోం క్వారంటైన్‌లో ఉంటున్న ఆ దంపతుల్లో భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం లభ్యమైంది. అయితే ఇంట్లో మంటలు చెలరేగినట్లుగా గోడలు మసి పట్టి ఉండటం, మృతురాలి మొహం కాలిన గాయాలతో నల్లగా మారడం, వస్త్రాలు కూడా మసిపట్టి ఉండటంతో ఆమె మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతురాలు గ్రామానికి చెందిన చల్లా రామలక్ష్మి(28). ఆమె భర్త నాగరాజు. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహమవగా, ముగ్గురమ్మాయిలు ఉన్నారు. ఇటీవల రామలక్ష్మికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈనెల 8న పరీక్ష చేయించుకోగా  పాజిటివ్‌ వచ్చింది.  భర్త నాగరాజుకు కూడా వైరస్‌ సోకినట్లు మరుసటి రోజు పరీక్షలో తేలింది. దీంతో భార్యభర్తలను హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. నాగరాజు శనివారం రాత్రి మద్యం తాగొచ్చి రామలక్ష్మి వల్లే తనకు కరోనా వచ్చిందంటూ గొడవపడ్డాడు. దీంతో మృతురాలి తల్లి వచ్చి మందలించి వెళ్లింది. ఆదివారం ఉదయం మళ్లీ ఆమె ఇంటికి వెళ్లగా అదే సమయంలో నాగరాజు బయటకు వెళుతూ కనిపించాడు. ఇంటి తలుపులు తీసేందుకు మృతురాలి తల్లి ప్రయత్నించగా తెరుచుకోలేదు. చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తెరిచిచూడగా రామలక్ష్మి కాలిన గాయాలతో.. చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్న స్థితిలో మృతిచెంది కనిపించింది.  

Updated Date - 2020-10-12T09:31:20+05:30 IST