రూ.1,200 కోట్ల పెట్టుబడి
ABN , First Publish Date - 2020-08-12T09:15:59+05:30 IST
రూ.1,200 కోట్ల పెట్టుబడి

హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్స్ ఆర్‌అండ్‌డీ కేంద్రం
అమెరికా బయట ఇదే అతి పెద్దది వైద్య పరికరాల తయారీ కేంద్రంగా హైదరాబాద్: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): వైద్య పరికరాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెడ్‌ట్రానిక్స్ సంస్థ తెలంగాణను తన పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకుంది. అమెరికా ఆవల రెండో అతిపెద్ద అభివృద్ధి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పరిశోధన-అభివృద్థి కేంద్రాన్ని.. ‘మెడ్‌ట్రానిక్స్ ఇంజనీరింగ్-ఇన్నోవేషన్ సెంటర్’ పేరిట విస్తరించనుంది. ఇందుకు ఐదేళ్లలో రూ.1,200 కోట్లు వ్యయం చేయనుంది. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ మెడ్‌ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఒమర్ ఇస్రాక్‌తో మంగళవారం వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పెట్టుబడి విషయాన్ని ప్రకటించారు.
ఉపాధికి ఊతం.. పెట్టుబడులకు కీలకం
ఒమర్ ఇస్రాక్‌తో సమావేశం సందర్భంగా పెట్టుబడుల ఆకర్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ వివరించారు. వైద్య పరికరాల తయారీ రంగం అభివృద్థికి కట్టుబడి ఉన్నామని, మెడ్‌ట్రానిక్స్‌తో ఒప్పందమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. మిగతా సంస్థలతో కలిసి పనిచేస్తూ ప్రపంచ ఆరోగ్య రంగంలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తాని తెలిపారు. ‘మెడ్‌ట్రానిక్స్ అతిపెద్ద పరిశోధన-అభివృద్ధి కేంద్రానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం హర్షణీయం. తద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయి. వైద్య పరికరాల హబ్‌గానూ ఎదుగుతుంది’ అన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధన-అభివృద్ధి.. ఆవిష్కరణలకు దారితీస్తాయని, అదే తమ సంస్థ అభివృద్ధిలో కీలక సూత్రమని ఒమర్ ఇస్రాక్ అన్నారు. ‘తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తీసుకున్న నిర్ణయం భారత్‌లో పెట్టుబడుల పట్ల మా చిత్తశుద్ధిని చాటుతుంది. రోగుల బాధను దూరం చేసి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్నదే మా సంస్థ లక్ష్యం. ఆరోగ్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ లక్ష్యాల మేరకు మా భాగస్వామ్యం ఉంటుంది’ అని పేర్కొన్నారు. మెడ్‌ట్రానిక్స్ భారత ఉపఖండ ఉపాధ్యక్షుడు మదన్ కృష్ణ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల పీడితులకు ఉపశమనం కల్పించాలన్న ఉద్దేశంతో తమ సంస్థ ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు.