చెత్తను ఇంట్లో వేయించిన మునిసిపల్ అధికారిణి
ABN , First Publish Date - 2020-07-10T09:05:55+05:30 IST
చెత్తను ఇంట్లో వేయించిన మునిసిపల్ అధికారిణి

బయట పడేయడంతో ఆగ్రహం.. తంతానంటూ హెచ్చరిక
మెదక్ మునిసిపాలిటీ, జూలై 9: మెదక్‌లోని బ్రాహ్మణ వీధికి చెందిన శ్రీవాణి గురువారం ఉదయం తన ఇంటి ముందు చీపురుతో ఊడ్చి ఆ చెత్తను రోడ్డు పక్కన వేశారు. దీనిపై స్థానికులు మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ వనిత.. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయవ ద్దనని ఎంత చెప్పినా కొందరు పట్టించుకోవడం లేదంటూ కోపగించారు. రోడ్డు పక్కన చెత్తనంతా మునిసిపల్ సిబ్బందితో ఎత్తించి సదరు గృహిణి ఇంట్లో వేయించారు. ’’నకరాలు చేస్తున్నావా.. నేను శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను. తంతాన’’ంటూ గృహిణిని హెచ్చరించారు. ఆ ఇంటికి విద్యుత్తు సరఫరాను కూడా నిలిపివేయించారు. దీంతో చెత్తను బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి జరిమానా విధిస్తే సరిపోతుందని, శానిటరీ ఇన్‌స్పెక్టర్ తీరు అతిగా ఉందని పలువురు విమర్శించారు. మూడు రోజులుగా చెత్త సేకరణ వాహనం రావడం లేదని, శానిటరీ ఇన్స్‌స్పెక్టర్ వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తతంగమంతా గమనించిన ఓ ఉపాధ్యాయుడు.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పగా.. ’ఎవరికైన చెప్పుకో’ అంటూ శానిటరీ ఇన్‌స్పెక్టర్ దురుసుగా మాట్లాడడం గమనార్హం.