నిమ్జ్ భూసేకరణపై నేటి విచారణ ఆపండి
ABN , First Publish Date - 2020-07-10T08:57:14+05:30 IST
నిమ్జ్ భూసేకరణపై నేటి విచారణ ఆపండి

కేంద్ర మార్గదర్శకాలు పాటించాలి: హైకోర్టు
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): నేషనల్ ఇన్వె్‌స్టమెంట్ అండ్ మానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) భూసేకరణలో భాగంగా శుక్రవారం తలపెట్టిన బహిరంగ విచారణను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. దీన్ని మరో తేదీన జరుపుకోవచ్చునని తెలిపింది. తర్వాత తలపెట్టిన బహిరంగ విచారణ కూడా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనలకు అనుగుణంగా ఉండాలని తేల్చిచెప్పింది. జూన్ 29న కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనల ప్రకారం జూలై 31 వరకు ఎలాంటి సామాజిక/రాజకీయ/క్రీడలకు సంబంధించి సమావేశాలు నిర్వహించరాదని, ఒకేచోట ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడరాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 30న జీవో జారీచేసిందని గుర్తుచేసింది. భవిష్యత్తులో తలపెట్టే బహిరంగ విచారణలోనూ నిబంధనలను పాటించాలని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ సమీపంలో నిమ్జ్‌కోసం రూ.4వేల కోట్ల విలువ చేసే 12,635 ఎకరాల భూసేకరణ చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. అందులో భాగంగా శుక్రవారం బహిరంగ విచారణ కోసం జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ.. సంగారెడ్డి జిల్లా, న్యాల్‌కల్ మండలం మామిడ్గి గ్రామానికి చెందిన ఎం.రాజిరెడ్డి మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. కొవిడ్-19 నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నిబంధనల ప్రకారం ఒకేచోట పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటానికి వీల్లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం, బహిరంగ విచారణకోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను తప్పుపట్టలేమని తెలిపింది.