మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ మార్పుపై వ్యాజ్యం

ABN , First Publish Date - 2020-07-10T08:46:51+05:30 IST

మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ మార్పుపై వ్యాజ్యం

మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ అలైన్‌మెంట్‌ మార్పుపై వ్యాజ్యం

రైల్వే, కలెక్టర్‌, రెవెన్యూ అధికారులకు హైకోర్టు నోటీసులు


హైదరాబాద్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ మార్పు, భూసేకరణను సవాల్‌ చేస్తూ సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన కె. తిరుపతి మరో 45మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ ఏ. రాజశేఖర్‌రెడ్డి రైల్వే శాఖ, జిల్లా కలెక్టర్‌, భూసేకరణ ప్రత్యేక అధికారి, రెవెన్యూ అధికారులకు నోటీసులు జారీచేశారు. మూడు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైను సిరిసిల్ల, వేములవాడకు సమీపంగా వెళ్లేలా తొలుత ప్రణాళిక సిద్ధం చేశారని, పట్టణ ప్రాంతాల్లోని తమ విలువైన ఆస్తులు పోతాయంటూ కొంతమంది అభ్యంతరం చెప్పడంతో ఏకపక్షంగా రైల్వే లైన్‌ అలైన్‌మెంట్‌ మార్చారని పిటిషనర్లు ఆరోపించారు. మల్లన్న సాగర్‌, రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ల ముంపు గ్రామాల ప్రజలకు ఈ ప్రాంతంలోనే భూసేకరణ చేసి పునరావాసం కల్పించారని పిటిషనర్లు తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు 800 ఎకరాలు సేకరించిందని వారు పేర్కొన్నారు. రైల్వే లైను అలైన్‌మెంట్‌ను ఏకపక్షంగా మార్చివేసి అధికారులు మరో 237 ఎకరాల భూసేకరణకు సిద్ధమయ్యారని తెలిపారు. తామంతా చిన్న,సన్నకారు రైతులమని, ఈ భూమే తమకు జీవనాధారమని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. భూసేకరణ నోటిఫికేషన్‌ మార్చి మొదటి వారంలో ఒక ఆంగ్ల దినపత్రికలో ఇచ్చారని,  ఈ విషయం తమకు మార్చి నెలాఖరుకు తెలిసిందన్నారు. అప్పటికే  రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించారని చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత అధికారులను కలిసి తమ అభ్యంతరాలు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదన్నారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌కు ఏకపక్షంగా అలైన్‌మెంట్‌లో మార్పులు చేస్తూ జారీచేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేయాలని, ఇందుకోసం జారీచేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను నిలుపుదల చేయాలని వారు తమ వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. 

Updated Date - 2020-07-10T08:46:51+05:30 IST