అమ్మా.. నిన్ను చంపేస్తాం!
ABN , First Publish Date - 2020-07-10T08:39:32+05:30 IST
అమ్మా.. నిన్ను చంపేస్తాం!

కన్నతల్లి వద్ద డబ్బు, నగలు గుంజుకున్న కొడుకుల బెదిరింపు
యాదాద్రి టౌన్, జూలై 9: ఆమె వారి కన్నతల్లి. కానీ ఆ కనికరం వారిలో మచ్చుకైనా లేదు. 70 ఏళ్ల వృద్ధురాలన్న జాలీ లేదు. ఆ పండుటాకు వద్ద ఉన్న డబ్బు, నగలను గుంజుకున్నారు. ఆమె భారమైందని భావించి.. చంపేస్తామంటూ బెదిరింపులు మొదలుపెట్టారు. డబ్బు పిచ్చితో వారు అన్నంత పనీ చేస్తారేమోనని భయపడిన ఆ తల్లి, యాదాద్రిలోని పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో తలదాచుకుంది. వంగపల్లిలోని అమ్మ ఒడి అనాథాశ్రమ నిర్వాహకులు గురువారం ఆమెతో మాట్లాడగా.. తన బాధనంతా చెప్పుకొని బోరుమని విలపించింది. చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన జెల్ల సంపూర్ణ దీన గాథ ఇది. భర్త కిష్టయ్య చనిపోయాక.. ఆయన పేరిట ఉన్న పొలంపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తోంది. కుమారులు శ్రీనివాస్, జ్ఞానేశ్వర్‌లు ఆమె బంగారం, డబ్బు, ఆస్తిపత్రాలు తీసుకొని చిత్రహింసలకు గురిచేశారు. గ్రామ పెద్దలకు చెప్పినా స్పందన రాకపోవడంతో సంపూర్ణ మూడు రోజులుగా దేవస్థానం సమీపంలో ఉంటోంది. సంపూర్ణకు ఆశ్రమ నిర్వాహకులు ఆశ్రయం ఇచ్చారు.
న్యాయం చేయండి..
నన్ను చంపుతామని బెదిరిస్తున్న నా కుమారులపై తగిన చర్యలు తీసుకోవాలి. వారిపై చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది. కొడుకుల వద్దకు వెళ్లను. డబ్బు, బంగారం, ఆస్తి పత్రాలు ఇప్పిస్తే.. నా బతుకు నేను బతుకుతాను. నాకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను.