నిఘా నీడలో కూల్చివేత
ABN , First Publish Date - 2020-07-10T08:38:14+05:30 IST
నిఘా నీడలో కూల్చివేత

కూలీలను తనిఖీ చేశాకే లోపలికి.. ఫోన్లకూ అనుమతి లేదు
ఫొటో తీసిన ఇద్దరు పోలీసులపై వేటు
అడుగడుగునా ఆంక్షలు, తనిఖీలు
బందోబస్తులో 2 వేలమంది పోలీసులు
సీఎస్, డీజీపీల స్వీయ పర్యవేక్షణ
మూడో రోజు ఏ, బీ బ్లాకుల కూల్చివేత
మరో 3 బ్లాకులు 50 శాతం పూర్తి
బ్లాస్టింగ్ వద్దు... యంత్రాలే ముద్దు
భవనాల కూల్చివేత తేలిగ్గా పూర్తవ్వడానికి వాడే ఇంప్లోజన్, బ్లాస్టింగ్ ప్రక్రియలను ఇక్కడ చేపట్టవద్దని నిర్ణయించారు. ఇంప్లోజన్(అంతస్పోటనం)తో నిమిషాల్లో కూల్చివేత పూర్తవుతుంది. కానీ, సీఎం కేసీఆర్ వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇంప్లోజన్ పద్ధతి వద్దని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు. ఇంప్లోజన్‌తో భవనం మొత్తం ఒకేసారి కాళ్లు విరిగిన జంతువు లాగా జంతువులా కూలబడుతుంది. ఇంతటి బరువుతో కూలబడడం వల్ల భూ ప్రకంపనలు తలెత్తే అవకాశాలుంటాయని, హుస్సేన్‌సాగర్ కట్టకు ప్రమాదమని హెచ్చరించారు.
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): సచివాలయ కూల్చివేత పనులు పూర్తి నిఘా నీడలో సాగుతున్నాయి. మొదటి రోజు కంటే మూడో రోజు రెట్టింపయింది. సచివాలయ దరిదాపుల్లోకి అనుమతి ఉన్న వారు తప్ప ఇతరులు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఇద్దరే మొత్తం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దాంతో కింది స్థాయి అధికారులు, పోలీసులు ఏ మాత్రం పొరపాట్లు దొర్లకుండా మసలుకుంటున్నారు. కూలీలను కూడా నఖశిఖ పర్యంతం తనిఖీ చేశాకే లోనికి వెళ్లనిస్తున్నారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను తీసుకుని మరీ లోపలకు పంపుతున్నారు. తెలిసో తెలియకో ఫొటోలు తీసిన ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు వేశారు. సచివాలయానికి వచ్చే మార్గాలన్నీ మూసేసి, కిలోమీటరు వరకు ఆంక్షలు విధించి, కూల్చివేతను కొనసాగిస్తున్నారు. తొలిరోజు పనులు వేగంగా సాగగా, బుధవారం కాస్త మందగించాయి. గురువారం కూడా నెమ్మదిగానే సాగాయి. సి-బ్లాక్‌కు కుడి వైపున ఉన్న ఏ, బీ బ్లాకుల భవనాలను పాక్షికంగా కూల్చేశారు. భవనాల ముందున్న ఎలివేషన్ భాగాన్ని తొలగించారు. కే బ్లాక్‌లోని పోస్టాఫీ్‌సను పూర్తిగా కూల్చేశారు. సీ, డీ, జీ బ్లాకుల కూల్చివేత 40-50 శాతం వరకు పూర్తయింది. స్టోన్ బిల్డింగ్ మొత్తం పూర్తయింది. సీఎస్ ఇచ్చే సూచలన మేరకే కింది స్థాయి అధికారులు కూల్చివేత ప్రణాళికను అమలు చేస్తున్నారు. డీజీపీ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. బందోబస్తులో 2,000 మంది పోలీసులు పాల్గొంటున్నారు. గురువారం ఇద్దరు కానిస్టేబుళ్లు కూల్చివేత ఫొటోలు తీశారని గుర్తించి, డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. 500 మంది కూలీలు కూల్చివేత పనుల్లో పాల్గొంటున్నారు.
ఇంప్లోజన్, బ్లాస్టింగ్ లేనట్లే
భవనాల కూల్చివేత తేలిగ్గా పూర్తవ్వడానికి వాడే ఇంప్లోజన్, బ్లాస్టింగ్ ప్రక్రియలను ఇక్కడ చేపట్టవద్దని నిర్ణయించారు. అన్ని భవనాల కూల్చివేతను మిషనరీ ద్వారానే పూర్తి చేస్తారు. మొదట్లో ఇంప్లోజన్(అంతస్పోటనం) ప్రక్రియను అమలు చేద్దామనుకున్నారు. అలాగైతే నిమిషాల్లో కూల్చివేత పూర్తవుతుందని, శిథిలాల తరలింపు మెల్లగా చేపట్టవచ్చని భావించారు. సీఎం కేసీఆర్ వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఇంప్లోజన్ పద్ధతి వద్దని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు. హుస్సేన్‌సాగర్ కట్టకు ప్రమాదమని హెచ్చరించారు. అక్కడి నుంచి నీళ్లు సచివాలయం వరకు సీపేజ్ అయ్యే అవకాశముందని కూడా చెప్పారు. పైగా సచివాలయం, బిర్లా మందిర్ సమీపంలో కొన్ని నేలమాళిగలు గతంలో బయటపడ్డాయి. హుస్సేన్ సాగర్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు నిజాం కాలం నాటి భూగర్భ నీటి పారుదల వ్యవస్థ ఉంది. ఇంప్లోజన్‌తో ఇలాంటి నేల మాళిగలు, భూగర్భ కాలువలు కుంగిపోయి అనేక భవనాలు దెబ్బతింటాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. భవనాలను 15 శాతం కూల్చేశాక బ్లాస్టింగ్ పద్ధతిన మిగతాది కూల్చాలన్న సూచన కూడా వచ్చింది. ఇది కూడా శ్రేయస్కరం కాదని నిపుణులు తేల్చారు. బ్లాస్టింగ్ వల్ల భారీగా దుమ్ము వస్తుందని, పరిసర ప్రాంతాల వారికి ఇబ్బందికరమని, బీఆర్కే భవనం, మింట్ కాంపౌండ్ భవనాలు బ్లాస్టింగ్ ప్రకంపనలతో దెబ్బ తింటాయని చెప్పారు. చివరకు యంత్రాల ద్వారానే కూల్చాలని నిర్ణయించారు. అన్ని భవనాల కూల్చివేతకు 20 రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు.