ఇలాగైతే గాలినీ కొనుక్కోవాలి

ABN , First Publish Date - 2020-07-08T08:20:38+05:30 IST

ఇలాగైతే గాలినీ కొనుక్కోవాలి

ఇలాగైతే గాలినీ కొనుక్కోవాలి

వ్యవసాయాన్ని పండుగగా  మార్చుతాం: కేటీఆర్‌


సిరిసిల్ల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ‘బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తాగునీళ్లు కొనుక్కుంటారంటే అంద రూ నవ్వారు. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చింది. అడవులను ఇష్టారీతిగా నరికితే గాలిని కూడా కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది. భవిష్యత్‌లో మన పిల్లలు భుజాన ఆక్సిజన్‌ సిలిండర్లు వేసుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే అడవులను కాపాడుకోవాలి. హరితహారంలో విరివిగా మొక్కలు నాటాలి’ అని  రాష్ట్ర మంత్రి కే తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో దశాబ్దాలుగా  పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు మంగళవారం 281 ఎకరాల కు చెందిన పట్టాలు పంపిణీ చేశారు. దీంతో పాటు మండలంలో బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించారు. రైతువేదిక భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. ఉద్యమ స్ఫూర్తితో పచ్చదనం పెంచే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. అధికారులు ఎంతో కసరత్తు చేసి దశాబ్దాల కాలంగా ఉన్న రంగంపేట అటవీ భూ సమస్యలను పరిష్కరించారని, 307 మందికి 281 ఎకరాల భూమిపై యజమాన్య హక్కులను కల్పించారని అన్నారు. కరోనా సమయంలోనూ పట్టాలను అందించేది గిరిజనుల్లో చిరునవ్వులు చూడడానికేనని, అందుకోసమే వచ్చానని చెప్పారు. రైతును రాజును చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమన్నారు. వ్యవసాయాన్ని పండుగగా మార్చేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని, అలాగే, సాగు నియంత్రణ తీసుకొచ్చామన్నారు.. అంతేకాకుండా రైతుబంధుతో పాటు  రైతు చనిపోతే బాధిత కుటుంబం వీధిన పడవద్దని రూ.5 లక్షల బీమా అందిస్తున్నట్లు తెలిపారు. గిరిజనులే పాలన చేసుకునే విధంగా 500 జనాభా ఉన్న ప్రతి తండాను గ్రామ పంచాయతీగా మార్చామన్నారు. ఎలాంటి ఎన్నికలూ లేవని, రాజకీయ లాభాపేక్ష లేకుండా భవిష్యత్‌ తరాలు బాగుండాలన్న ఆలోచనలతో ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధికే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. గ్రామీణ రహదారులు, వంతెనల విషయంలో గణనీయమైన పురోగతి సాధించామన్నారు.  

Updated Date - 2020-07-08T08:20:38+05:30 IST