ఆత్మహత్యల్లో 4వ స్థానం

ABN , First Publish Date - 2020-09-21T07:23:46+05:30 IST

దేశంలో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి లక్ష మందిలో 20.6 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. జాతీయ సగటు

ఆత్మహత్యల్లో 4వ స్థానం

తెలంగాణలో ప్రతి లక్ష మందిలో 20.6 మంది బలవన్మరణం

భారతదేశ సగటు 10.6

మొత్తం ఆత్మహత్యల్లో 18-30 ఏళ్లవారు 35 శాతం

తెలంగాణలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు: కేంద్రం


హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి లక్ష మందిలో 20.6 మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. జాతీయ సగటు కంటే ఇది చాలా ఎక్కువ. ఇటీవల లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వనీ కుమార్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశంలో ఆత్మహత్యల సంఖ్యలో సిక్కిం అగ్రస్థానంలో ఉంది. అక్కడ ప్రతి లక్ష మందిలో 33.1 మంది బలవన్మరణం చెందగా, 26.4 మందితో ఛత్తీ్‌సగఢ్‌ రెండో స్థానంలో ఉంది. కేరళలో ప్రతి లక్ష మందిలో 24.3 మంది, తెలంగాణలో 20.6 మంది, త్రిపురలో 18.2 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. బలవన్మరణాల్లో జాతీయ సగటు 10.4 మంది.


ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో ప్రధానంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వారే ఎక్కువగా ఉన్నారు. జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్‌సీఆర్బీ) విడుదల చేసిన 2019 నాటి ప్రమాద మరణాలు, ఆత్మహత్యల నివేదిక ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్నవారిలో ఈ వయసు వారు 35.06 శాతం మంది ఉన్నారు. 18 ఏళ్లలోపువారు 6.91 శాతం, 30-45 ఏళ్ల వారు 31.83 శాతం, 45-60 ఏళ్లవారు 18.28 శాతం, 60 ఏళ్లపైన వారు 7.92 శాతం మంది ఉన్నారు. సామాజిక, ఆర్థిక, మానసిక, ఆరోగ్య, సమస్యలు.. మద్యానికి బానిస కావడం, ఉద్యోగం కోల్పోవడం, దీర్ఘకాలిక వ్యాధుల వంటివి బలవన్మరణాలకు కారణమవుతున్నాయని ఎన్‌సీఆర్బీ నివేదికలో పేర్కొంది.


మూడేళ్లుగా తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయి. మూడేళ్లుగా రాష్ట్రంలో రహదారులపై ప్రమాదాలు తగ్గుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. 3 రోజుల క్రితం లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. ఈ ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా మొదటి ఆరు నెలల కాలంలో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది దేశంలో అత్యధిక ప్రమాదాలు జరిగిన రాష్ట్రాలు వరుసగా మధ్యప్రదేశ్‌(19,724), తమిళనాడు (18,923), ఉత్తరప్రదేశ్‌ (15,670). కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఇప్పటి వరకు 8,210 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. తెలంగాణలో 2017 నుంచి ప్రతి ఏటా కొద్దికొద్దిగా ప్రమాదాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2017లో 22వేలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగితే, 2018లో దానికంటే 254 తక్కువగా, 2019లో అంతకంటే 660 ప్రమాదాలు తక్కువగా జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. 2019లో ప్రతి నెలా సగటున 1,797 రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే, ఈ ఏడాది తొలి 6 నెలల్లో లాక్‌డౌన్‌ కారణంగా నెలకు సగటున 1,461 ప్రమాదాలు జరిగాయి. 


ప్రమాదాలకు కారణాలివే..

రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలున్నప్పటికీ ప్రధానంగా అతి వేగం, డ్రైవింగ్‌లో మొబైల్‌ ఫోన్‌ వాడటం, డ్రగ్స్‌, మద్యం సేవించి వాహనం నడపటం, ఓవర్‌ లోడ్‌, వాహన కండిషన్‌ సరిగా లేకపోవడం, వెలుతురు తక్కువగా ఉండటం, జంపింగ్‌ రెడ్‌ సిగ్నల్‌, ఓవర్‌ టేకింగ్‌, వాతావరణం సరిగా లేకపోయినా ప్రయాణం కొనసాగించడం, రాంగ్‌ సైడ్‌లో వెళ్లడం, రహదారులు సరిగా లేకపోవడం, కొందరు సైక్లి్‌స్టలు, పాదచారుల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లు కేంద్రం తెలిపింది.

Updated Date - 2020-09-21T07:23:46+05:30 IST