ఎంపీ అరవింద్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసీఆర్ వ్యూహం..!

ABN , First Publish Date - 2020-10-03T17:51:41+05:30 IST

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమయం ముంచుకొస్తుండటంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అధికార పార్టీ వేస్తున్న ఎత్తులతో చల్లటి

ఎంపీ అరవింద్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కేసీఆర్ వ్యూహం..!

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమయం ముంచుకొస్తుండటంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అధికార పార్టీ వేస్తున్న ఎత్తులతో చల్లటి వాతావరణంలోనూ విపక్ష నాయకుల్లో హీట్‌ పెంచుతున్నాయి. కల్వకుంట్ల కవిత ఎన్నిక లాంఛనప్రాయమే అయినా ప్రలోభాల పర్వం కొనసాగుతుండటం ప్రతిపక్ష పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతకీ గులాబీ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్ వెనక ఉన్న రాజకీయం ఏమిటి? ఏ పార్టీని ప్రధానంగా దెబ్బతీయాలనుకుంటుంది? ఇక్కడ గెలిచే అభ్యర్థి ఎన్నాళ్లు పదవిలో కొనసాగనున్నారు? ఈ కథనంలో తెలుసుకుందాం.. 


కాంగ్రెస్, బీజేపీలను కంగుతినిపించేలా...

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈనెల 9న జరగబోయే ఉప ఎన్నిక కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్‌ తనయ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రత్యర్థి పార్టీల అంచనాలకు అందని విధంగా గులాబీ దళపతి వ్యూహాలు రచిస్తూ తనదైన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి కల్వకుంట్ల కవిత గెలిచేందుకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ప్రలోభాలను కంటిన్యూ చేస్తూ విపక్షాలను నివ్వెరపరుస్తున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకుని..అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న బీజేపీకి ఇక్కడ భారీ విజయం సాధించి షాక్‌ ఇవ్వాలన్నది టీఆర్‌ఎస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఏదో గెలిచాం అన్నట్లుగా కాకుండా కాంగ్రెస్‌, బీజేపీలను కంగుతినిపించేలా విజయం ఉండాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. 


నానా తంటాలు పడుతున్న ఎంపీ అరవింద్...

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పోతన్ కర్ లక్ష్మీనారాయణ ఉన్నారు. ఈ ఎన్నికలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు. మొత్తం 824 మంది ఓటర్లున్న ఈ ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు. ఎంఐఎం ప్రతినిధులు అధికార పార్టీకి మద్ధతు పలుకుతున్నారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిపి 609 మంది ఓటర్లు కవితకు అండగా ఉన్నారు. కాంగ్రెస్‌కు 136 మంది, బీజేపీకి 79 మంది మద్దతుదారులున్నారు. ఎన్నికల సమయం నాటికి కాంగ్రెస్, బీజేపీకి చెందిన మరికొందరు గులాబీ పార్టీకి మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి కవిత విజయం లాంఛనప్రాయమే కానుంది. వార్‌వన్ సైడ్‌గానే ఉన్నప్పటికీ అధికార పార్టీ పెద్దలు బలం, బలగం పెంచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కారు ఎక్కేస్తున్నారు. ప్రధానంగా బీజేపీకి ఓట్లు గణనీయంగా తగ్గించడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి కమలం పార్టీకి చెందిన నాయకులను ఒక్కొక్కరిగా గులాబీ గూటికి చేర్చుకుంటూ నిజామాబాద్ ఎంపీ అరవింద్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వలసలను ఆపేందుకు ఆయన నానా తంటాలు పడుతున్నారట. 


ఆ పార్టీకి చెందిన నేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్...

ప్రధానంగా నిజామాబాద్ నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు లక్ష్యంగా అధికార పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్రయోగించింది. 60 డివిజన్లలో కమలం పార్టీకి 28 మంది కార్పొరేటర్లుండగా, ఇప్పటికే 14 మంది గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మిగతా వారిని ఆకర్షించేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 30 మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు అధికార పార్టీకి జై కొట్టేశారు. ఎన్నికల్లో మద్దతు పలికేలా మరికొందరితో ఒప్పందాలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన వారంతా గతంలోనే టీఆర్ఎస్‌లో చేరారు. ఇలా కూడగట్టిన మద్దతుదారులతో టీఆర్ఎస్ బలమైన శక్తిగా మారింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. అయినా ప్రలోభాలకు గురిచేస్తుండటంతో ఎంపీ ధర్మపురి అరవింద్ ఇక్కడే మకాం వేసి ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని పరిశీలిస్తున్నారు. టీఆర్ఎస్ నేతల ఎత్తుగడలు, పార్టీ ఫిరాయింపుల కోసం జరుగుతున్న ప్రలోభాలను ఎత్తి చూపుతున్నారు. నేరుగా ఎన్నికల్లో సత్తా చాటే ధైర్యం లేక పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. 


ఎమ్మెల్సీగా కొనసాగుతారా? మంత్రివర్గంలో చేరుతారా?

కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా గెలువగానే ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని స్థానికంగా చర్చ జరుగుతోంది. కీలకమైన శాఖను అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆరేళ్ళ కాలపరిమితి గల ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరి 4న ముగియనుంది. అంటే కాలపరిమితి ఇంకా 15 నెలలు మాత్రమే ఉంటుంది. 2016 జనవరి 5న డాక్టర్ భూపతిరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తర్వాత ఆయనను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హుడిగా ప్రకటించారు. దాంతో 2019 జనవరి 16న ఆయన ఎమ్మెల్సీ పోస్టు ఊడిపోయింది. సుమారు 20 నెలలకు పైగా ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక జరగబోతోంది. ఈ క్రమంలో కవిత విజయం సాధిస్తే 15 నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారు. మరి ఆమె మంత్రివర్గంలో చేరుతారా? లేక ఎమ్మెల్సీగానే కొనసాగుతారా? వేచి చూడాల్సిందే.

Updated Date - 2020-10-03T17:51:41+05:30 IST