ట్రిపుల్‌ ధమాకా!

ABN , First Publish Date - 2020-12-30T06:25:56+05:30 IST

కొత్త సంవత్సరం ముంగిట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వారికి వేతనాలను, ఉద్యోగ విరమణ వయసును పెంచుతామని, పదోన్నతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఫిబ్రవరిలో ఖాళీలు భర్తీ

ట్రిపుల్‌ ధమాకా!

వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంపు

వెంటనే పదోన్నతులు... అందుకు కమిటీలు

ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక

ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు

ఆర్టీసీ జీతాలూ పెంపు.. భారం సర్కారుదే

కాంట్రాక్టు వర్కర్లు, పెన్షనర్లకూ పెరుగుదల

హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, 

ఆశా వర్కర్లు, విద్యా వలంటీర్లకూ పెంపు

రాష్ట్రంలో 9,36,976 మందికి ప్రయోజనం

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం

సీఎస్‌ అధ్యక్షతన ముగ్గురు అధికారులతో కమిటీ

ఉద్యోగుల సమస్త సమస్యలపై వారిదే నిర్ణయం

ఫిబ్రవరి నాటికి అన్నీ పరిష్కరించాలని ఆదేశం


హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరం ముంగిట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వారికి వేతనాలను, ఉద్యోగ విరమణ వయసును పెంచుతామని, పదోన్నతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఫిబ్రవరిలో ఖాళీలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకూ తీపి కబురు చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, సెర్ప్‌, ఆర్టీసీ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, విద్యావలంటీర్లు ఇలా ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతామని సీఎం చెప్పారు. నూతన సంవత్సర కానుకగా మొత్తం 9,36,976 మందికి వేతనాలు పెరగనున్నట్లు వెల్లడించారు.


జీతాల పెంపుపై మంగవారం  అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. పీఆర్సీ నివేదిక ఆధారంగా ఎంత పెంచాలో నిర్ణయం తీసుకొనేందుకు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కమిటీ జనవరి రెండో వారంలో ఉద్య్గోగ సంఘాలతో సమావేశమై జీతాల పెంపు, రిటైర్మెంట్‌ వయసుపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, వర్క్‌ చార్జుడ్‌ ఉద్యోగులు, దినసరి వేతన ఉద్యోగులు, పూర్తి స్థాయి కాంటింజెంట్‌ ఉద్యోగులు, తాత్కాలిక కాంటింజెంట్‌ ఉద్యోగులు, హోం గార్డులు, అంగన్‌ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ప్‌ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపుదల ఉంటుందని సీఎం చెప్పారు. వేతనాలు తక్కువగా ఉంటే ఆర్టీసీలోనూ వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే, ఆర్టీసీ వేతనాల పెంపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, పదవీ విరమణ జరిగిన రోజే  ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం లాంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. 


త్రిసభ్య కమిటీ

అన్ని అంశాలపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అధ్యక్షుడిగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌ సభ్యులుగా త్రిసభ్య సంఘాన్ని నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండో వారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతుంది. ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.  


అడ్డంకులు తొలగిపోయాయి

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల సిబ్బందికి వేతనాలు పెంచామని సీఎం గుర్తు చేశారు. ప్రభుత్వానికున్న ఆర్థిక పరిమితులకు లోబడి అన్ని రకాల ఉద్యోగులకు కచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచుతామని ప్రకటించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని ఇచ్చిన ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నామని, త్రిసభ్య కమిటీ ఉద్యోగ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీతో వివాదాలు పరిష్కారం అయినందున పోలీసు, రెవెన్యూ సహా అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలని చెప్పారు. అన్ని శాఖల్లో వెంటనే శాఖాపరమైన పదోన్నతుల కమిటీలను వేయాలన్నారు. పదోన్నతుల తర్వాత ఖాళీ అయిన పోస్టుల భర్తీకి  ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు.


వెంటనే అమలు చేయాలి: ఉద్యోగ జేఏసీ

జనవరి మొదటివారం నుంచే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు వేతన సవరణ అమల్లోకి తేవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. సీఎం కేసీఆర్‌ను టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎం.రాజేందర్‌, టీజీవోల సంఘం అధ్యక్షురాలు వి.మమతల నేతృత్వంలోని ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వేతనాల పెంపు, పదవీ విరమణ వయసు పెంపు, పదోన్నతులు, ఖాళీల భర్తీపై సీఎం నిర్ణయాన్ని స్వాగతించాయి. 


నాలుగేళ్లుగా ఎదురుచూపు

ఆర్టీసీలో కొత్త పీఆర్సీ 1.4.2017 నుంచే అమల్లోకి రావాలి. ఈ కొత్త వేతనాల కోసం ఉద్యోగులు 55 రోజుల పాటు సమ్మె కూడా చేశారు. నాలుగేళ్లు గడుస్తున్నా కొత్త వేతనాలు అమలు కావడం లేదు. 16 శాతం ఐఆర్‌ అమలవుతోంది. పీఆర్సీ అమలుతో పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందంటూ సీఎం భరోసా ఇవ్వడం ఆర్టీసీకి కొంత ఊరటనేని చెబుతున్నారు.


సర్వీస్‌ రూల్స్‌తో స్పష్టత

‘‘ప్రతి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో తెలిసి ఉండాలి. రిటైర్‌ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ రూపొందించాలి. పదోన్నతుల కోసం ఎవరి వద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. ఏ ఆఫీసుకూ తిరిగే అవసరం రావొద్దు. సమయానికి ఉద్యోగికి రావాల్సిన ప్రమోషన్‌ ఆర్డర్‌ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్‌ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్‌ రూల్స్‌ ఉండాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్ల కోసం రిటైర్డు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరిగే దురవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉండవద్దు. కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరగడం విషాదకరం. దు:ఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం పడొద్దు. అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలి’’ అని కేసీఆర్‌ ఆదేశించారు.


మెరుగైన ఫిట్‌ మెంట్‌ ఇవ్వాలి: ట్రెసా

గత పీఆర్సీలో 42ు ఫిట్‌మెంట్‌ ఇచ్చినట్లుగానే ఈసారి కూడా మెరుగైన ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(ట్రెసా) అధ్యక్ష, కార్యదర్శులు వి.రవీందర్‌రెడ్డి, గౌతమ్‌ కుమార్‌లు డిమాండ్‌ చేశారు. రె వెన్యూ ఉద్యోగులకు ప్రత్యేక స్కేలు ఇవ్వాలని కోరారు. వేతన సవరణ, పదోన్నతులు, పదవీ విరమణ పెంపు వంటి అంశాలపై మళ్లీ అధ్యయనం వద్దని, అధ్యయనం చేయకుండానే అమల్లోకి తేవాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సి.హెచ్‌.సంపత్‌కుమార్‌ స్వామి డిమాండ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ అడ్డం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బేషరతుగా 65 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేసి, 61 ఏళ్లకు పదవీ విరమణ వయసును పెంచాలని డి మాండ్‌ చేశారు. సీఎం నిర్ణయం ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా ఉందని టీఎన్‌జీవో మాజీ అధ్యక్షులు దేవీప్రసాద్‌, రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.


ఫిట్‌మెంట్‌ 25-30 శాతమే!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వేసిన తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదిక వారంలోగా ప్రభుత్వానికి చేరనుంది. ఈ నివేదిక ప్రధానంగా రెండు లేదా మూడంచెల ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి సంకేతాలు చేరినట్లు సమాచారం. ఉద్యోగ సంఘాల అంచనాల ప్రకారం.. కమిషన్‌ రెండు రోజుల్లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. ఉద్యోగ సంఘాలు 63ు ఫిట్‌మెంట్‌, రూ.24 వేల కనీస మూల వేతనాన్ని సిఫారసు చేయాలని కోరుతున్నాయి. కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఫిట్‌మెంట్‌ 25-30 శాతం లోపే ఉండనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఒక్క శాతం వేతనంపెంచితే రూ.200 కోట్ల దాకా అవుతుందని లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన 25ు వేతనాలు పెంచితే ఏడాదికి రూ.5000 కోట్లు కానున్నాయి. 2018 జూలై 1 నుంచి వేతనాలు పెరగాల్సి ఉండగా.. వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టారు. అదే తేదీ నుంచి వేతనాలు పెంచితే 25ు ఫిట్‌మెంట్‌ చొప్పున వేతన బకాయిల రూపేణా దాదాపు రూ.13 వేల కోట్ల దాకా చెల్లించాల్సి ఉంటుంది. 

Updated Date - 2020-12-30T06:25:56+05:30 IST