హక్కుల కోసం ఆదివాసీల ఆందోళన

ABN , First Publish Date - 2020-12-10T08:22:13+05:30 IST

హక్కుల కోసం ఆదివాసీలు ఆందోళన బాట పట్టారు. ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ నాయకులు ఇచ్చిన రాష్ట్ర బంద్‌ పిలుపు మేరకు బుధవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమరం భీం

హక్కుల కోసం ఆదివాసీల ఆందోళన

ఆదిలాబాద్‌ జిల్లా సంపూర్ణ బంద్‌

ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్‌  


ఆదిలాబాద్‌/నిర్మల్‌/ఆసిఫాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): హక్కుల కోసం ఆదివాసీలు ఆందోళన బాట పట్టారు.  ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ నాయకులు ఇచ్చిన రాష్ట్ర బంద్‌ పిలుపు మేరకు బుధవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్‌, ఉట్నూర్‌ బస్‌ డిపోల ముందు  ఆదివాసీలు బైఠాయించి ఆర్టీసీ బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.  బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వరుసగా రెండు రోజుల పాటు బంద్‌ పాటించడంతో ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఆర్టీసీకి కోటి రూపాయల వరకు నష్టం వచ్చినట్లు అధికారుల అంచనా. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో బైక్‌ ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.  ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని పలువురు ఆదివాసీ నాయకులు డిమాండ్‌ చేశారు. లంబాడాల కుల, ఏజెన్సీ ధ్రువ పత్రాలను రద్దు చేసి ఆదివాసీలు సాగు చేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 


జీవో నెంబర్‌ 3ని యథావిధిగా కొనసాగించాలని, నాన్‌ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించి, ఏజెన్సీ ప్రాంతంలో ఎల్‌ఆర్‌ఎ్‌సను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  ఆదివాసీలకు అన్ని వర్గాల మద్దతు లభించడంతో ఆదిలాబాద్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా జరిగింది. అలాగే నిర్మల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఆదివాసీలు ఆందోళన చేశారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు బెజ్జూరు, కెరమెరి, సిర్పూర్‌(టి), రెబ్బెన, చింతలమానేపల్లి, సిర్పూర్‌(యూ) మండలాలో,్ల మంచిర్యాల జిల్లా దండేపల్లి, కాసిపేట మండలాల్లో  ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. ఆదివాసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆడె జంగు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోట్నాక విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T08:22:13+05:30 IST