రవాణా శాఖ కమిషనరేట్ ముట్టడి
ABN , First Publish Date - 2020-10-01T07:17:10+05:30 IST
మ్యాక్సీ క్యాబ్స్, మినీ బస్సులను నడిపే ట్రావెల్ ఆపరేటర్లు బుధవారం ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ కమిషనరేట్‌ను ముట్టడించారు. త్రైమాసిక మోటారు వాహన పన్ను....
త్రైమాసిక వాహన పన్ను మాఫీ చేయాలని డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మ్యాక్సీ క్యాబ్స్, మినీ బస్సులను నడిపే ట్రావెల్ ఆపరేటర్లు బుధవారం ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ కమిషనరేట్‌ను ముట్టడించారు. త్రైమాసిక మోటారు వాహన పన్నును మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి తరలి వచ్చిన ఆపరేటర్లు కమిషనరేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరిన ఆపరేటర్లను పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్ కారణంగా వాహనాలు నడవక రోడ్డున పడిన తమ నుంచి ప్రభుత్వం త్రైమాసిక మోటారు వాహన పన్నును ముక్కు పిండి వసూలు చేస్తుందని తెలంగాణ స్టేట్ క్యాబ్స్, బస్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ నిజాముద్దీన్ ఆరోపించారు. సెప్టెంబరు 5న తాము ధర్నా చేయడంతో పన్ను మాఫీ ప్రతిపాదనను ప్రభుత్వ పరిశీలనకు పంపుతామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. పన్ను మాఫీ ఉత్తర్వులు వెలువడలేదని, పైగా వాహనాలకు పెద్ద మొత్తంలో పెనాల్టీ విధిస్తున్నారని తెలిపారు.