త్వరలో ఐఏఎస్‌ల బదిలీలు!

ABN , First Publish Date - 2020-12-27T08:31:24+05:30 IST

త్వరలో ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఒకటి కంటే ఎక్కువ శాఖల

త్వరలో ఐఏఎస్‌ల బదిలీలు!

పలువురికి అదనపు బాధ్యతల విముక్తి..

లూప్‌లైన్‌లోని కొందరికి ప్రాధాన్యం 

 ఉద్యోగుల్లో వ్యతిరేకతపై సర్కారు దృష్టి

 ఐపీఎస్‌ల బదిలీలూ జరిగే అవకాశం


హైదరాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): త్వరలో ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఒకటి కంటే ఎక్కువ శాఖల బాధ్యతలు చూస్తున్న వారికి భారం తగ్గించడం, వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇవ్వడం వంటి చర్యలు తీసుకోనుందని సమాచారం. కరోనా లాక్‌డౌన్‌ అనంతరం ఇప్పుడిప్పుడే రాష్ట్రం కుదుట పడుతున్నందున... పాలనా వ్యవస్థను గాడిలో పెట్టాలని సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నట్లు తెలిసింది.


ఐఏఎస్‌ అధికారుల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఉద్యోగుల్లో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉందని భావిస్తున్నారు. సీనియర్‌ ఐఏఎస్‌లూ కినుక వహిస్తున్నారు. తమకు సరైన పోస్టింగ్‌ ఇవ్వలేదని ఆందోళనలో ఉన్న అధికారులున్నారు. ఇలాంటి వారందరినీ సక్రమంగా సర్దుబాటు చేయవచ్చని తెలిసింది.


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలతోపాటు సోమేశ్‌ కుమార్‌ వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ బాధ్యతలను చూడాల్సి వస్తోంది. ఇటీవల ధరణి పోర్టల్‌ సంస్కరణల సందర్భంగా రిజిస్ట్రేషన్ల బాధ్యతలను కూడా మోయాల్సి వచ్చింది. ఆయనకు భారాన్ని తగ్గించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు సమాచారం. రవాణా, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలు తొలగించే అవకాశాలున్నాయి. కలెక్టర్లు సందీప్‌ కుమార్‌ ఝా, మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌,  వాసం వెంకటేశ్వర్లు కొత్త పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు.


ప్రణాళిక సంఘం సభ్య కార్యదర్శి సురేష్‌ చందా, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం  ఏడీజీ హరిప్రీత్‌సింగ్‌ వంటి సీనియర్‌ ఐఏఎస్‌లు తమకు అప్రాధాన్య పోస్టింగ్‌లు ఇచ్చారన్న అసంతృప్తితో ఉన్నారు. కొన్ని జిల్లాల కలెక్టర్లపై ఫిర్యాదులుండడంతో వారిని మార్చాలని పభుత్వం యోచిస్తోంది.


రాష్ట్రంలోనే ప్రధానమైన సీసీఎల్‌ఏ పోస్టులో ఎవరినీ నియమించలేదు. కొన్ని శాఖలకు కార్యదర్శులు లేరు. ఆర్టీసీకి ఎండీ, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌కు జేఎండీ, ఇతర సంస్థలకు ఎండీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటిపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఐఏఎస్‌లతోపాటు ఐపీఎస్‌ల బదిలీలు కూడా జరుగుతాయని సమాచారం.


Updated Date - 2020-12-27T08:31:24+05:30 IST