పంటకు నిప్పు పెట్టుకునేలా చేసిన టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2020-10-31T09:21:27+05:30 IST

పెట్టుబడి కూడా రాదని పంటకు నిప్పుపెట్టుకునే పరిస్థితి తెచ్చిన టీఆర్‌ఎ్‌సకు దుబ్బాక ఉప ఎన్నికలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని

పంటకు నిప్పు పెట్టుకునేలా చేసిన టీఆర్‌ఎస్‌

దుబ్బాకలో గుణపాఠం తప్పదు: ఉత్తమ్‌ 


దుబ్బాక/హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడి కూడా రాదని పంటకు నిప్పుపెట్టుకునే పరిస్థితి తెచ్చిన టీఆర్‌ఎ్‌సకు దుబ్బాక ఉప ఎన్నికలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. నియంత్రిత సాగు పేరిట సన్నరకం పంటను వేసేలా ఆంక్షలు పెట్టిన సీఎం కేసీఆర్‌.. రైతుల పాలిటశాపంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపాలిటీ పరిధిలోని లచ్చపేట వార్డులో, మండలంలోని రఘోత్తంపల్లిలో ప్రచారం నిర్వహించిన ఆయన మాట్లాడారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నారన్నారు.టీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందంతోనే నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే కాంగ్రెస్‌ ఆఽధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కాగా, భూములకు సంబంధించి లోపాలు సరిచేయకుండా ఆగమాగంగా ధరణి పోర్టల్‌ను ఎందుకు ప్రారంభించారని టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. చాలా ప్రాంతాల్లో భూమి ఒక చోట ఉంటే సర్వే నంబర్‌ మరో చోట ఉందని, కొన్ని ప్రాంతాల్లో 10 గుంటల భూమికి 10 రకాల సర్వే నంబర్లు ఉండటం వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. సన్నరకం వరి వేసి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు మద్దతు ధర.. దానిపైన బోన్‌సనూ ప్రకటించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.


నేడు కాంగ్రెస్‌ సత్యాగ్రహ దీక్ష 

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం అన్ని జల్లా కేంద్రాల్లో సత్యాగ్రహ, ఉపవాస దీక్షలు నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.

Updated Date - 2020-10-31T09:21:27+05:30 IST