ఎక్కడికక్కడ అరెస్టులు

ABN , First Publish Date - 2020-07-27T08:25:09+05:30 IST

కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దళితులపై దాడులు దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు

ఎక్కడికక్కడ అరెస్టులు

  • కాంగ్రెస్‌ ‘చలో మల్లారం’ను అడ్డుకున్న పోలీసులు
  • కేసీఆర్‌ పాలనలో దళితులకు రక్షణ కరువు
  • వారిపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు
  • దళితులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది: ఉత్తమ్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. దళితులపై దాడులు దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల ప్రమేయమే ఎక్కువగా ఉందని ఆరోపించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం శోచనీయమన్నారు. దళితులు, గిరిజనుల మద్దతుతోనే అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ఆ ఆ తరువాత విస్మరించారని అన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం మల్లారం గ్రామానికి చెందిన దళిత యువకుడు రేవెళ్లి రాజబాబు దారుణ హత్యను నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ‘చలో మల్లారం’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.


ఉత్తమ్‌ తోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉపనేత డి.శ్రీధర్‌బాబు ఇతర నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి బయలు దేరిన ఉత్తమ్‌ను జనగామ పోలీసులు పెంబర్తి వద్దనే అరెస్టు చేసి, లింగాలఘణపురం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరేళ్లుగా దళితులపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ నాయకులను నిర్బంధాలకు గురి చేయడం సరికాదన్నారు. దళితులకు న్యాయం జరిగేవరకు పోరాటాలు కొనసాగిస్తామని, వారికి అండగా ఉంటామని తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు.  ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ దుశ్చర్యలకు పాల్పడుతున్న సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని భట్టి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంతో సామాజిక తెలంగాణ ఏర్పడుతుందనుకున్న ప్రజల ఆశలను వమ్ముచేస్తూ.. రాష్ట్రాన్ని ఫ్యూడల్‌ వ్యవస్థలోకి నెట్టివేసేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్కను హన్మకొండలోని ఆమె నివాసంలో నిర్బంధించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును మంథనిలో అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.


రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?: శ్రీధర్‌భాబు

కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేయడం హేయమైన చర్య అని శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రఽశ్నించారు. పోలీసులు టీఆర్‌ఎస్‌ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజబాబు హత్య కేసులో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు రాజకీయాలకు అతీతంగా పత్రికా ఎడిటర్లతో కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్‌ ద్రోహం చేశారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కాగా, రాజబాబు హత్యతో టీఆర్‌ఎ్‌సకు సంబంధం లేదని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కాంగ్రె్‌సకు పోటీగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. మల్హర్‌, కాటారం, మహదేవపూర్‌ మండలాల్లో టీఆర్‌ఎస్‌ నేతలను కూడా ముందస్తుగా అరెస్ట్‌ చేశారు. 


నేడు రాజ్‌భవన్‌ వద్ద కాంగ్రెస్‌ ఆందోళన

రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇందుకు నిరసనగా దేశ వ్యాప్తంగా చేపట్టిన ఆందోళనల్లో భాగంగా సోమవారం రాజ్‌భవన్‌ ఎదుట ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు కాంగ్రెస్‌ శ్రేణులు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. మొన్న కర్ణాటక, నిన్న మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీ కుట్రలు చేసి ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిందని, నేడు రాజస్థాన్‌లో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కాగా, బీజేపీతో దేశంలో రాజ్యాంగ వ్యవస్థలకు ముప్పు ఏర్పడిందని కాంగ్రెస్‌ రాష్ట్రవ్య వహారాల ఇన్‌చార్జ్‌ ఆర్‌సీ ఖుంటియా అన్నారు. 

Updated Date - 2020-07-27T08:25:09+05:30 IST