ఆటో డ్రైవర్లకు ఆసరగా నిలిచిన ఉత్తమ్

ABN , First Publish Date - 2020-04-24T21:33:04+05:30 IST

కరోనా వ్యప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులను పెంచడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేవలం లక్షలో 35 మందికి టెస్ట్‌లు చేస్తోందన్నారు.

ఆటో డ్రైవర్లకు ఆసరగా నిలిచిన ఉత్తమ్

నల్లగొండ : కరోనా వ్యప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా టెస్టులను పెంచడం లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేవలం లక్షలో 35 మందికి మాత్రమే టెస్ట్‌లు చేస్తోందన్నారు. టెస్టుల సంఖ్య పెరిగితే పాజిటీవ్ కేసుల నిర్ధారణ అంచనాలు మారే అవకాశాలు ఉన్నాయన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంధ్రభారతిలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 650 మంది ఆటో డ్రైవర్లకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. కరోనా నివారణలో ప్రభుత్వ చర్యలపై విమర్శలు గుప్పించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తమ ధాన్యం తామే తగల పెట్టుకునే పరిస్థితి నెలకొందన్నారు. లాక్‌డౌన్ ప్రకటించి నెల దాటినా.. చాలామంది రేషన్ లబ్దిదారులకు రేషన్, రూ.1500 చేరలేదన్నారు. ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయం అందిస్తున్నాయని పేర్కొన్నారు. తెల్లకార్డు లేనివారికి తక్షణమే రూ.1500తో పాటు రేషన్ అందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్రం ప్రకటించిన ఐదు కేజీల బియ్యం, పప్పు, ఉచిత ఎల్పీజీ సిలిండర్ నేటికీ లబ్దిదారులకు అందలేదన్నారు. ప్రభుత్వం వెంటనే వాటి వివరాలను తెలియజేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలన్నారు.

Updated Date - 2020-04-24T21:33:04+05:30 IST