లొంగుబాటలో పాత పీపుల్స్ వార్ అగ్రనేతలు
ABN , First Publish Date - 2020-09-03T09:32:54+05:30 IST
మావోయిస్టు అగ్రనేత గణపతి, పార్టీ కేంద్ర కమిటీకి చెందిన మల్లోజుల వేణుగోపాల్‌తోపాటు మరికొందరు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొండపల్లి సీతారామయ్య హయాంలో గణపతి,

- మావోయిస్టు పార్టీపై పెరుగుతున్న
- పాత ఎంసీసీ నేతల పట్టు
- కటకం సుదర్శన్, మల్ల రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి,
- కడారి సత్యనారాయణ లొంగుబాటుకు సిద్ధం!
- అడవులు వీడనున్న గణపతి సహచరి సుజాత,
- మల్లోజుల సహచరి తారాబాయి
- పోలీసులు, రాజకీయ నేతలతో సంప్రదింపులు
- భాస్కర్ కోసం కొనసాగుతున్న పోలీసుల వేట
- ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రిలో డీజీపీ పర్యటన
- ప్రాణహిత పరిసర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి, పార్టీ కేంద్ర కమిటీకి చెందిన మల్లోజుల వేణుగోపాల్‌తోపాటు మరికొందరు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొండపల్లి సీతారామయ్య హయాంలో గణపతి, మల్లోజులతో పాటు పార్టీలో చేరిన కటకం సుదర్శన్ కూడా లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గణపతి సహచరి సుజాత, మల్లోజుల సహచరి తారాబాయి కూడా అడవులను వీడనున్నట్లు తెలిసింది. సెంట్రల్ కమిటీ సభ్యులైన మల్ల రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కడారి సత్యనారాయణ లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మరికొందరు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారని, తమ లొంగుబాట్ల కోసం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సాయంతో పోలీసులు, రాజకీయ నాయకులను సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారం ఆడెల్లు అలియాస్ భాస్కర్, ఆయన దళాన్ని పట్టుకునేందుకు పోలీసులు వేట ముమ్మరం చేశారు. భాస్కర్ నేతృత్వంలో యాక్షన్ టీం.. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మకాం వేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు, వారికోసం గాలింపు ముమ్మరం చేశారు. ఓ వైపు దాడులకు వ్యూహం రూపొందిస్తునే పార్టీలో కొత్త వారి నియామకానికి భాస్కర్ ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 1995లో దళంలో చేరిన భాస్కర్, మొదట బోధ్ దళ సభ్యుడిగా పనిచేశారు. ఇంద్రవెల్లి దళం డిప్యూటీ కమాండర్‌గా పనిచేసి అక్కడి నుంచి కేంద్ర కమిటీ ఆదేశానుసారం ఛత్తీ్‌సగఢ్ దండకారణ్యంలోకి వెళ్లారు. ఇటీవల పోలీసుల నుంచి త్రుటిలో తప్పించుకున్న భాస్కర్‌కు సంబంధించిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కొందరు ఆదివాసీ నాయకులు, యువకులకు డబ్బులు ఇచ్చి తమ భావజాలాన్ని మావోయిస్టు పార్టీ వ్యాప్తి చేయిస్తోందని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి జిల్లా పోలీసులు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు.
మూడు జిల్లాల్లో డీజీపీ పర్యటన
మావోయిస్టుల లొంగుబాటు, భాస్కర్ కోసం వేట కొనసాగుతున్న సమయంలో డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం ఆసిఫాబాద్‌లో ఆయన పర్యటించారు. ప్రాణహిత, పరిసర ప్రాంతాల్లో డీజీపీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అక్కడి అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో డీజీపీ నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. లొంగుబాట్లు, కదలికల నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై జిల్లా అధికారులకు డీజీపీ దిశానిర్దేశం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పర్యటించిన డీజీపీ మరోసారి పర్యటనలు చేపట్టడం విశేషం. ఇక మావోయిస్టుల కదలికలు, డీజీపీ జిల్లాల పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. లొంగుబాటు కోసం రాజకీయ నాయకులను మావోయిస్టులు సంప్రదిస్తున్నారన్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో నిఘా వర్గాలు ఆరాతీస్తున్నాయి.