నీటి వాటాలో అన్యాయాన్ని సహించం
ABN , First Publish Date - 2020-10-03T09:23:24+05:30 IST
నదీ జలాల వాటాలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించేది లేదని సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌కు చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన
ఏపీ తప్పుడు ప్రాజెక్టులను అంగీకరించం
‘అపెక్స్ కౌన్సిల్’లో బలంగా వాదిస్తాం
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ.. తాజా పరిణామాల నివేదన
హైదరాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): నదీ జలాల వాటాలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించేది లేదని సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌కు చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన జలాల్లో చిన్న చుక్కను కూడా వదులుకోవటానికి సిద్ధంగాలేమని స్పష్టం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌తో సీఎం కేసీఆర్ శుక్రవారం దాదాపు అరగంటపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన తాజా పరిణామాలను తమిళిసైకి క్లుప్తంగా నివేదించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీపై ఈనెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం పూర్వాపరాలు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్‌కు ప్రధానంగా వివరించినట్లు తెలిసింది.
నదీ జలాల పంపిణీ వ్యవహారంలో కేంద్రం తీరు బాగాలేదని కేసీఆర్ ఆమెకు చెప్పారు. ఈ విషయాన్ని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఎండగట్టబోతున్నట్లు వెల్లడించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఏపీలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆ కోవ కిందికే వస్తుందన్నారు. దీనిపైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిరసన తెలియజేస్తామని చెప్పారు. నదీ జలాల్లో హక్కుగా రావాల్సిన వాటా కోసం అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రం తరఫున వాదనలను ఆధారాలతో సహా బలంగా వినిపిస్తామని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మరోసారి లేఖ రాసినట్లు తెలిపారు. నదీ జలాల వాటాలో తెలంగాణకు అన్యాయం జరిగితే తీవ్ర స్థాయి పోరాటానికి కూడా సిద్ధమని సీఎం కేసీఆర్ గవర్నర్‌తో చెప్పారని సమాచారం. కాగా, దసరా పండుగ రోజు నుంచి ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తుందని తమిళిసైకి సీఎం కేసీఆర్ తెలియజేశారు. అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ జరుగుతుందని చెప్పారు. అలాగే కొత్త రెవెన్యూ విధానం అమలు, వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ గురించి వివరించారు. రాష్ట్రంలో భూ వివాదాలకు చరమగీతం పాడాలనేది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఈసారి కరోనా కారణంగా బతుకమ్మ పండుగను పెద్దఎత్తున నిర్వహించటంలేదని చెప్పారు. రాజ్‌భవన్‌లో కొత్తగా ప్రారంభించిన ఈ-ఆఫీస్ విధానాన్ని సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై వివరించారు.
డాక్టర్‌గా సౌందర రాజన్ సేవలు అభినందనీయం
ఇటీవల ధన్వంతరి అవార్డు పొందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్, ఉత్తమ వైద్య అధ్యాపకులు డాక్టర్ సౌందర రాజన్ (గవర్నర్ తమిళిసై భర్త)ను రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించారు. ఆయనకు శాలువా కప్పి, వీణ ప్రతిమను బహూకరించారు. సుదీర్ఘ కాలంగా వైద్య రంగంలో డాక్టర్ సౌందర రాజన్ అందిస్తున్న విశిష్ట సేవలు అభినందనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయనకు ధన్వంతరి అవార్డు వచ్చినందుకు యావత్ తెలంగాణ రాష్ట్రం గర్విస్తుందని తెలిపారు.