నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-09-13T08:40:39+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సందర్శించనున్నారు. ఐదేళ్ల

నేడు యాదాద్రికి  సీఎం కేసీఆర్‌

యాదాద్రి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సందర్శించనున్నారు. ఐదేళ్ల క్రితం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు ప్రారంభించిన నాటి నుంచి కేసీఆర్‌ యాదాద్రికి రావడం ఇది 13వ సారి. ఆదివారం ఉదయం యాదాద్రి కొండపైకి చేరుకొని తొలుత బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొండపై ప్రధానాలయాల పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు.


ప్రస్తుతం దేశంలోనే అద్భుత రాతి కట్టడంగా అపురూప శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా ఆలయ పునర్నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. దీంతో ఆలయ ఉద్ఘాటన ముహూర్తం నిర్ణయానికి ముందుగా కొండపై పరిసరాలు, భక్తులకు మౌలిక సదుపాయాలతో పాటు కొండకింద రహదారుల అభివృద్ధి, వసతి సదుపాయాల కల్పన అంశాలపై సీఎం కేసీఆర్‌ పర్యటనలో దృష్టి సారించే అవకాశాలున్నాయి.


ఆలయ ఉద్ఘాటన సందర్భంగా నిర్వహించనున్న మహాసుదర్శన యాగం ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారని సమాచారం. నిర్దేశిత గడువులోగా పనులు సంపూర్ణం చేసేందుకు తన పర్యటనలో అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్టు భావిస్తున్నారు.

సీఎం తొమ్మిదిమాసాల తర్వాత వస్తుండటంతో పనుల పురోగతిని ఆయనకు వివరించేందుకు వైటీడీఏ, ఆర్‌అండ్‌బీ అధికారులు, స్థపతులు అంతర్గత సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, రాచకొండ కమిషనరేట్‌ భువనగిరి జోన్‌ డీసీపీ కె.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సీఎం పర్యటన కార్యక్రమం, భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు. 


Updated Date - 2020-09-13T08:40:39+05:30 IST