అన్యాయాలపై ఎలుగెత్ని యోధుడు

ABN , First Publish Date - 2020-08-06T06:07:46+05:30 IST

ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌.. తెలంగాణ ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు. చీకట్లు కమ్మిన తెలంగాణలో ప్రత్యేక

అన్యాయాలపై ఎలుగెత్ని యోధుడు

నేడు తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జయంతి


హన్మకొండ, ఆగస్టు 5, (ఆంధ్రజ్యోతి) : ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌.. తెలంగాణ ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు. చీకట్లు కమ్మిన తెలంగాణలో ప్రత్యేక ఉద్యమాన్ని ప్రజ్వలింప చేసిన జ్వాల. ఐదు దశాబ్ధాలుగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శనం చేసిన ధృవతార. గురువారం జయశంకర్‌ జయంతి. 


ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంత అభివృద్ధి వేగంగా జరుగుతుందన్న ఆయన అభిప్రాయం వాస్తవ రూపం దాలుస్తోంది. నీళ్ళలో మనవాటా తేలితే జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఇప్పుడు గోదావరిపై నిర్మాణమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఇందుకు తాజా ఉదాహరణ. ఆచార్య జయశంకర్‌ తెలంగాణ కోసం రాజకీయ ప్రకియ అనివార్యమని ప్రగాఢంగా విశ్వసించారు. తెలంగాణ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడం ద్వారా పోరాటం సాగించిన ఉద్యమ శిఖరం. 


సాంస్కృతిక పునరుజ్జీవనం

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆయన ఎంతో ఆవేదన చెందారు. సీమాంధ్ర సంస్కృతిని మనమీద రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకించారు. జయశంకర్‌ నడిచే విజ్ఞాన సర్వస్వం. పలు అంశాలపైన ఆయనకు పూర్తి సాధికారత ఉండేది. బహుభాషా కోవిదుడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఆయనకు అపారమైన నైపుణ్యముండేది. ఆయన ఆర్ధిక శాస్త్రవేత్త మాత్రమే కాదు. గొప్ప రాజనీతిజ్ఞుడు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని తన ప్రసంగాల ద్వారానే కాక రచనల ద్వారా కూడా ప్రజలకు విడమరిచి చెప్పారు. ఇందుకు ఆయన రాసిన పుస్తకాలు, వందలాది వ్యాసాలు తెలంగాణ ఉద్యమ చరిత్రకు బోధనకు పాఠ్యగ్రంథాలయ్యాయి.


గ్రామీణ నేపథ్యం

జయశంకర్‌ 1934 ఆగస్టు 6న ప్రస్తుత వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి. తండ్రి లక్ష్మీకాంతారావు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు  అక్క చెల్లెళ్ళు. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారి. అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. 


పరిపాలనాధక్షుడు

ఎమర్జెన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, వైస్‌చాన్స్‌లర్‌గా, హైదరాబాద్‌లో సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, న్యూఢిల్లీలోని ప్రభుత్వ జాతీయ కమిషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్టార్‌  మెంబర్‌గా, కేరళలోని మహాత్మాగాంధీ వర్సిటీ ప్లానింగ్‌ బోర్డు సభ్యుడిగా, సీఫెల్‌, వరంగల్‌లోని ఆర్‌ఈసీలకు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ సభ్యుడిగా వివిధ పదవులను సమర్ధవంతంగా నిర్వహించి పాలనాధక్షుడిగా పేరు గడించారు.  ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను యాబై ఏళ్ళుగా బతికించి.. శిఖరాగ్రస్థాయికి చేర్చి.. తాను కలలు కన్న ప్రత్యేక రాష్ట్రాన్ని  కళ్ళార చూడకుండానే 2011 జూన్‌ 21న కన్నుమూశారు. జయశంకర్‌ సార్‌ స్వప్నించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.

Updated Date - 2020-08-06T06:07:46+05:30 IST