నేడు అసెంబ్లీ రేపు కౌన్సిల్‌

ABN , First Publish Date - 2020-10-13T09:36:46+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చట్టాల సవరణ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శాసనసభ, మండలి సమావేశాలు మంగళ,

నేడు అసెంబ్లీ రేపు కౌన్సిల్‌

ఉభయసభల్లో నాలుగు బిల్లులు ప్రవేశం!

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 50% మహిళా కోటా

‘నాలా’ అధికారాలు తహసీల్దార్లకు..

ప్రశ్నోత్తరాలు లేకుండానే బిల్లులపై చర్చ


హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చట్టాల సవరణ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శాసనసభ, మండలి సమావేశాలు మంగళ, బుధవారాల్లో జరగనున్నాయి. మంగళవారం శాసనసభలో ప్రభుత్వం నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనుంది. వీటిని సభ ఆమోదించగానే బుధవారం మండలిలో ప్రవేశపెట్టనుంది. ఇలా ఉభయసభల్లో ఆమోదం లభించిన తర్వాత గవర్నర్‌ పరిశీలనకు పంపనుంది. సెప్టెంబరు 6 నుంచి 16 వరకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. సమావేశాల ముగింపు తర్వాత ఉభయ సభలు ప్రొరోగ్‌ కావాలి. కానీ, కొన్ని చట్టాల్లో సవరణల కోసం సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయకుండా కొనసాగింపులో ఉంచింది.


వర్షాకాల సమావేశాలకు కొనసాగింపుగానే తాజాగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. ప్రశ్నోత్తరాల సమయం లేకుండానే ఉభయ సభలు సమావేశమవుతాయి. జీహెచ్‌ఎంసీ చట్టం-1955(సవరణ) బిల్లు-2020, ఇండియన్‌ స్టాంపు యాక్ట్‌-1899(సవరణ) బిల్లు-2020, తెలంగాణ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ ఫర్‌ నాన్‌-అగ్రికల్చరల్‌ పర్పసెస్‌ యాక్ట్‌(సవరణ) బిల్లు-2020, సీఆర్‌పీసీ సవరణ బిల్లు-2020లను ప్రవేశపెట్టబోతుంది. ఇండియన్‌ స్టాంపు యాక్ట్‌ సవరణ, నాలా బిల్లులను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇక జీహెచ్‌ఎంసీ బిల్లులను మంత్రి కేటీఆర్‌, సీఆర్‌పీసీ బిల్లును మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెడతారని తెలిసింది.


  1. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం ప్రతి ఎన్నికలకు రొటేషన్‌ ప్రాతిపదికన డివిజన్ల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈసారి రిజర్వేషన్ల జోలికి వెళ్లకుండా 2016 ఎన్నికల నాటి రిజర్వేషన్ల ప్రాతిపదికనే  ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో జీహెచ్‌ఎంసీ చట్ట సవరణకు సిద్ధమైంది.
  2. 2016 ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పాలక వర్గంలో మహిళలకు 50% ప్రాతినిధ్యాన్ని వర్తింపజేసింది. కానీ, అప్పట్లో చట్టాన్ని సవరించకుండా జీవో జారీ చేసింది. ఈసారి చట్టాన్ని సవరించనుంది. 
  3. స్టాంపు డ్యూటీ వసూళ్ల సందర్భంగా భూముల మార్కెట్‌ విలువలను తగ్గించే రిజిస్ట్రేషన్‌ అధికారుల విచక్షణాధికారాలకు ప్రభుత్వం కత్తెర వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘ఇండియన్‌ స్టాంపు యాక్ట్‌-1899’ను సవరిస్తూ బిల్లును ప్రవేశపెట్టనుంది.
  4. వ్యవసాయ భూముల నుంచి నివాస ప్రాంతాలుగా మార్చే క్రమంలో అమలవుతున్న ‘తెలంగాణ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ కన్వర్షన్‌ ఫర్‌ నాన్‌-అగ్రికల్చరల్‌ పర్పసెస్‌ యాక్ట్‌ (నాలా)’ను కూడా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్డీవోకు ఉన్న విచక్షణాధికారాలను తహసీల్దార్లకు బదలాయించనుంది. 


కొవిడ్‌ పరీక్షలు తప్పనిసరేం కాదు

‘అసెంబ్లీ’ ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్‌ 

శాసనసభ, మండలి సమావేశాలు ఒక్క రోజు మాత్రమే నిర్వహిస్తున్న నేపథ్యంలో సభ్యులు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధనను పక్కన పెట్టేశారు. మంగళ, బుధ వారాల్లో జరిగే శాసనసభ, మండలి సమావేశాలకు వచ్చే సభ్యులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు సూచించారు. సమావేశాల ఏర్పాట్లును సోమవారం పరిశీలించారు. భౌతిక దూరం పాటిస్తూ గత సమావేశాల్లో చేసిన సీటింగ్‌ ఏర్పాటునే యథాతథంగా కొనసాగించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

Updated Date - 2020-10-13T09:36:46+05:30 IST