కరోనా చికిత్సకు కాంటినెంటల్‌ సిద్ధం

ABN , First Publish Date - 2020-04-25T09:23:35+05:30 IST

కోవిడ్‌-19 చికిత్సలో మెరుగైన ఫలితాలు ఇస్తున్న ప్లాస్మా థెరపీని రోగులకు అందించేందుకు కాంటినెంటల్‌ ఆస్పత్రి సిద్ధంగా ఉందని ఆస్పత్రికి చెందిన ప్రముఖ రుమటాలజిస్టు ఎస్‌కె గుప్త తెలిపారు.

కరోనా చికిత్సకు కాంటినెంటల్‌ సిద్ధం

ప్లాస్మా థెరపీయే ఉత్తమమైనది

ప్రభుత్వ అనుమతులే తరువాయి: ఎస్‌కే గుప్త


రాయదుర్గం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): కోవిడ్‌-19 చికిత్సలో మెరుగైన ఫలితాలు ఇస్తున్న ప్లాస్మా థెరపీని రోగులకు అందించేందుకు కాంటినెంటల్‌ ఆస్పత్రి సిద్ధంగా ఉందని ఆస్పత్రికి చెందిన ప్రముఖ రుమటాలజిస్టు ఎస్‌కె గుప్త తెలిపారు. చికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ బాగా ఉపయోగపడుతుందని ఐసీఎంఆర్‌ ప్రకటించడంతో ఈ మేరకు తాము సిద్ధమయ్యామని, ప్రభుత్వం అనుమతిస్తే చికిత్స ప్రారంభిస్తామని చెప్పారు. కన్వలసెంట్‌ ప్లాస్మా థెరపీ, సీపీ ప్రక్రియ ద్వారా కరోనా సోకి కోలుకున్న వారి రక్తం నుంచి ప్లాస్మాను సేకరించి వ్యాధితో బాధపడుతున్న వారికి ఎక్కిస్తామన్నారు. రక్తంలోని ప్లాస్మా కణాలు అందించడంపై సాధారణ ప్రజల్లో ఉన్న భయాన్ని పోగొట్టి తగిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్మా థెరపీలో ప్లాస్మా సేకరణ తర్వాత సిరంను వేరుచేసి వైర్‌సను రూపుమాపే యాంటీబాడీలు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు.


వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తుల  కన్వలసెంట్‌, రక్తంలోని సిరాన్ని వైరస్‌ ఉన్న వ్యక్తికి ఎక్కించడం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీపీ, కన్వలసెంట్‌ ప్లాస్మా థెరపీ అంటే అడాప్ట్‌ ఇమ్యూనో థెరపీ చేయడమేనని గుప్త వివరించారు. అనేక సంక్రమిత వ్యాధుల నిరోధానికి ఈ విధానాన్ని దాదాపు వందేళ్లకు పైగా అవలంబిస్తున్నారన్నారు. డిప్తీరియా వ్యాధి చికిత్సలో పెన్సిలిన్‌ కంటే ముందుగా దీనినే ఉపయోగించారని గుర్తు చేశారు. సార్స్‌, మెర్స్‌, హెచ్‌-1, ఎన్‌-1 వైర్‌సలు వ్యాపించినప్పుడు కూడా చికిత్సలో ఈ థెరపీయే అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందని ఆయన చెప్పారు. 

Updated Date - 2020-04-25T09:23:35+05:30 IST