పులి జాడలు..!
ABN , First Publish Date - 2020-09-03T09:54:51+05:30 IST
పొరుగు రాష్ట్రాల నుంచి పులులు తెలంగాణలోకి వలస వస్తున్నాయి. గోదావరి దాటి మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్

- భూపాలపల్లి-మహముత్తారం అడవుల్లో సంచారం
- ఆరా తీస్తున్న అటవీ శాఖ అధికారులు
భూపాలపల్లి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పొరుగు రాష్ట్రాల నుంచి పులులు తెలంగాణలోకి వలస వస్తున్నాయి. గోదావరి దాటి మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్ అభయారణ్యాల నుంచి సరిహద్దు జిల్లాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోం ది. భూపాలపల్లి మండలం ఆజంనగర్, మహముత్తారం మండలం యామన్‌పల్లి మధ్య అడవుల్లోని బండ్లవాగు ఏరియాలో 3 రోజుల క్రితం పులి అడుగులు కనిపించాయి. నిమ్మగూడెం వద్ద ఓ ఆవును కూడా వేటాడినట్టు అధికారులు గుర్తించారు. దాన్ని మగ పులిగా అటవీ అధి కారులు అంచనా వేశారు. భూపాపల్లి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో మల్హర్ మండలం కిషన్‌రావుపల్లి సమీపంలోని అడవుల్లో బుధవారం మరో పులి అడుగులు కనిపించాయి. కాళేశ్వరం అవతలి వైపు మంచిర్యాల జిల్లా కొటపల్లి అడవుల్లోనూ 3 రోజుల క్రితం పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి.
దీంతో ఐదారు రోజుల్లో గోదావరి పరీవాహక ప్రాంతం అడవుల్లో 3 పులుల జాడను అధికారులు గుర్తించారు. కాగా, భూపాలపల్లి, ములుగు జిల్లా పరిధిలోని భూపాలపల్లి, మహముత్తారం, పలిమెల, కన్నాయిగూడెం, తాడ్వాయి, ఏటూరు నాగారం అడవుల్లో మరిన్ని పులులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. గత రాత్రి భూపాలపల్లి-కాటారం 263 నంబరు జాతీయ రహదారిపై నుంచి ఓ పులి రోడ్డు దాటినట్టు సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అయింది. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రాల్లోని అభయారణ్యం నుంచి పులులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నట్టు కొంత కాలంగా అధికారులు గుర్తిస్తున్నారు. అక్కడ పులుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు అవి సంచరించేందుకు సరిపడినంతగా అటవీ ప్రాంతం లేకపోవడంతో పులులు తెలంగాణ వైపు వస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.