స్థానికంగా మరో ముగ్గురికి

ABN , First Publish Date - 2020-03-25T09:54:23+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి చెందుతోంది. మంగళవారం మరో ముగ్గురికి లోకల్‌ కాంటాక్టు ద్వారా వైరస్‌ సోకింది. వీరిలో కొత్తగూడెం డీఎస్పీ, వారి ఇంట్లో పనిచేసే వంట మనిషి కూడా

స్థానికంగా మరో ముగ్గురికి

కొత్తగూడెం డీఎస్పీకి పాజిటివ్‌.. వారి వంటమనిషికి కూడా కరోనా

మణికొండ వ్యక్తి కుటుంబంలోనూ ఒకరికి 

5కు చేరిన కరోనా లోకల్‌ కాంటాక్టులు

మొత్తం 39కు చేరిన పాజిటివ్‌ల సంఖ్య 

దేశంలో మృతులు పది మంది

519కి చేరిన మొత్తం కేసుల సంఖ్య


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి చెందుతోంది. మంగళవారం మరో ముగ్గురికి లోకల్‌ కాంటాక్టు ద్వారా వైరస్‌ సోకింది. వీరిలో కొత్తగూడెం డీఎస్పీ, వారి ఇంట్లో పనిచేసే వంట మనిషి కూడా ఉన్నారు. ఈ డీఎస్పీ.. లండన్‌ నుంచి వచ్చిన తన కుమారుణ్ని క్వారంటైన్‌కు పంపకుండా ఇంట్లోనే ఉంచుకోవడంతో ఆయనపై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం తొలుత డీఎస్పీతోపాటు ఆయన ఇంట్లో ఎవరికీ కరోనా సోకలేదని ప్రచారం జరగగా.. చివరికి ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక ఇప్పటికే పాటిజివ్‌గా తేలిన మణికొండకు చెందిన వ్యక్తి కుటుంబంలోని మహిళ(64)కు కూడా కరోనా సోకింది. రాష్ట్రంలో ఇంతకుముందే ఇద్దరికి లోకల్‌ కాంటాక్టు ద్వారా కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో తాజాగా ఈ కేసుల సంఖ్య ఐదుకు చేరింది.


మంగళవారం మొత్తంగా ఆరు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మిగిలిన ముగ్గురు విదేశాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. వీరితో కలిసి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 39కి చేరింది. మరో రెండు పాజిటివ్‌ కేసులు కూడా నిర్ధారణ అయినా.. వారి నమూనాలను మరోసారి పరీక్షించిన అనంతరం బుధవారం వెల్లడించే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే మంగళవారం నమోదైన నాలుగు కేసుల్లో ముగ్గురు మహిళలే కావడం గమనార్హం. ఇందులో ఇద్దరు 60 ఏళ్ల వయసు పైబడినవారే ఉన్నారు. లండన్‌ నుంచి వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన వ్యక్తి(34)తోపాటు జర్మనీ నుంచి వచ్చిన కోకాపేటకు చెందిన మహిళ(39)కు, సౌదీ అరేబియా నుంచి వచ్చిన హైదరాబాద్‌లోని బేగంపేటకు చెందిన మరో మహిళ(36)కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.


హోం క్వారంటైన్‌ అతిక్రమణ.. రెండో కేసు

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తి రోడ్లపై షికారు చేస్తుండటంతో మాదాపూర్‌ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఆస్ట్రేలియా నుంచి ఐదు రోజుల క్రితం వచ్చిన రోహన్‌(20) అనే యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి వైద్య పరీక్షలకు తరలించారు. రాష్ట్రంలో ఇలాంటి కేసు ఇది రెండవది కావడం గమనార్హం. ఇక గత నెలలో జర్మనీకి వెళ్లి వచ్చి.. తాజ్‌కృష్ణా హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న రాంనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అక్కడినుంచి తప్పించుకున్నాడు.  మరోవైపు జిల్లాల్లో అధికారులు కరోనా తనిఖీలు కొనసాగిస్తున్నారు.


ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో క్వారంటైన్‌ ముద్రతో కనిపించిన నలుగురు యువకులను హైదరాబాద్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన 9 మంది ఇటీవల గోవా టూర్‌కు వెళ్లి రావడంతో వారిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన, ఇటీవల సౌదీ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.  


జిల్లాల నుంచి పలువురు ఆస్పత్రికి..

జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరిని గాంధీ ఆస్పత్రికి తరలించడంతోపాటు ఐదుగురిని జిల్లా కేంద్రంలోని ఐసొలేషన్‌ కేంద్రంలో చేర్చారు. నారాయణపేట జిల్లా కొత్తగార్లపల్లి గ్రామానికి చెందిన 9 మంది వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి రాగా.. వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన ఓ మెడిసిన్‌ విద్యార్థిని కజకిస్థాన్‌ నుంచి ఇటీవల రాగా.. ఆమెను, రంగారెడ్డి జిల్లా మంచాల మండలానికి చెందిన ఓ యువకుడినీ, ఇటీవల జర్మనీ నుంచి వచ్చిన చందానగర్‌లో నివాసముంటున్న ఓ మహిళ(39)నూ మంగళవారం గాంధీకి తరలించారు. వీరితోపాటు సంగారెడ్డి జిల్లాలో ముగ్గురు, వికారాబాద్‌ జిల్లాలో ఒకరిని కూడా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఐసొలేషన్‌ వార్డు నుంచి తప్పించుకున్న టీవీ ఫెడరేషన్‌ నాయకుడిని పోలీసులు తిరిగి ఆస్పత్రికి పంపించారు.  


ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం అధికారికి కరోనా లక్షణాలు 

కోఠిలోని ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఆయనను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం: డీజీపీ

ప్రస్తుత తరుణంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు లాక్‌ డౌన్‌ ఒక్కటే సరైన ఫార్ములా అని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ప్రజల సహకారంతోనే లాక్‌ డౌన్‌ సాధ్యమవుతుందన్నారు. అకారణంగా బయటికి రావడాన్ని ఎవరికి వారు నిరోధించుకోవాలని కోరారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పోలీసులతో కలిసి, ప్రజల రాకపోకల్ని కట్టడి చేయడంలో సహకరిస్తున్న వలంటీర్లకు డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.  సాయంత్రం 7 గంటల తర్వాత వందశాతం కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. 

Read more