బెదిరింపుల కన్సల్టెన్సీలు

ABN , First Publish Date - 2020-12-20T07:27:31+05:30 IST

సాధారణంగా అప్పు ఇచ్చినవాడే తీర్చమని అడుగుతాడు! ఇన్‌స్టెంట్‌ రుణ మాఫియాలో అలా కాదు. అక్కడ రుణం ఇచ్చేది ఒకరు.. దాన్ని తీర్చమంటూ ఫోన్లు చేసేది ముగ్గురు.

బెదిరింపుల కన్సల్టెన్సీలు

అప్పు ఇచ్చేది ఒకరు.. వేధించేది ముగ్గురు! 

మూడు కన్సల్టెన్సీలు.. 3 దశలుగా బెదిరింపులు

చివరి దశలో బండ బూతులు, అసభ్య మెసేజ్‌లు

హైదరాబాద్‌లో 2 కంపెనీలు.. 9 యాప్‌ల నిర్వహణ

రూ.60 కోట్లు పోగేసుకున్న అమెరికా రిటర్న్‌

తన కోసం 2 యాప్‌లు.. మరో రెండు విక్రయం

రికవరీకి గచ్చిబౌలిలో 120 మందితో కాల్‌సెంటర్‌

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలతో ఒప్పందాలు

నిర్వాహకులకు డబ్బూ ఆ సంస్థల నుంచే 

రెండు కంపెనీలపై సైబరాబాద్‌ పోలీసుల దాడులు

200 మంది టెలీకాలర్స్‌ను ప్రశ్నించిన పోలీసులు

పోలీసులను ఆశ్రయించిన 60 మంది బాధితులు


హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): సాధారణంగా అప్పు ఇచ్చినవాడే తీర్చమని అడుగుతాడు! ఇన్‌స్టెంట్‌ రుణ మాఫియాలో అలా కాదు.  అక్కడ రుణం ఇచ్చేది ఒకరు.. దాన్ని తీర్చమంటూ ఫోన్లు చేసేది ముగ్గురు. ఆ ఫోన్లు చేసేవారికి రుణం తీసుకున్నవారి వివరాలు గానీ,  ఇచ్చినవారి వివరాలు గానీ తెలియవు. చెల్లించే వాయిదాల గురించి గుర్తు చేయడం.. చెల్లించకపోతే ఎదురయ్యే ఇబ్బందులపై రుణగ్రహీతలను హెచ్చరించడం.. చివరాఖరుకు బండ బూతులు తిట్టడం చేస్తుంటారు.


ఈ మేరకు ఇన్‌స్టెంట్‌ రుణ యాప్‌ల నిర్వాహకులు.. ముగ్గురు చొప్పున కన్సల్టెంట్లను నియమించుకున్నారు! రుణాన్ని ఇవ్వడం యాప్‌ నిర్వాహకుల బాధ్యతైతే వసూలు చేసి పెట్టడం కన్సల్టెంట్ల బాధ్యత. కన్సల్టెంట్లేమో ఒక ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసుకొని పదుల సంఖ్యలో టెలీకాలర్లను నియమించుకున్నారు. రుణం తీసుకున్నవారికి ఫోన్లు చేసి అడగడం.. వీలైతే బండబూతులు తిట్టడం వీరి పనే! ఈ మేరకు ఇన్‌స్టెంట్‌ రుణ యాప్‌ల కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వివరాలు తెలిశాయి. ఈ దా‘రుణ’యాప్‌ నిర్వాహకుల వేధింపులను తాళలేక ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకోగా.. గత మూడు రోజుల్లో దాదాపు 60 మంది బాధితులు, సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు.


సీపీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు డీసీపీ క్రైం రోహిణి ప్రియదర్శిని, ఏసీపీ బాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు విచారణను ముమ్మరం చేసింది. రుణ దాతలకు ఫోన్‌లు చేసి వేధించిన వారిపై ప్రత్యే నిఘా పెట్టారు. పూర్తి ఆధారాలను పరిశీలించిన పోలీసులు, హైదరాబాద్‌లో రెండు కన్సల్టెన్సీలు రుణబాధితులకు ఫోన్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ కార్యాలయాలపై దాడులు చేశారు. అక్కడ పనిచేస్తున్న సుమారు 200 మందిని అదుపులోకి తీసుకొని విచారించారు.


నేడో రేపో నిర్వాహకులను అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలిసింది. కాగా న్యాయపరమైన ఇబ్బందులేమీ రాకుడా ఉండేందుకు పలు నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థల (ఎన్‌బీఎ్‌ఫసీ)తో యాప్‌ నిర్వాహకులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకొని దర్జాగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిసింది. పైగా ఎస్‌బీఎ్‌ఫసీలే నిర్వాహకులకు డబ్బు సమకూర్చుతున్నట్లు సమాచారం. 


షరతులేమీ చెప్పలేదు

ఇన్‌స్టెంట్‌ రుణాలు ఇచ్చే యాప్‌లో ఎక్కడా షరతులు చెప్పలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కేవలం రుణ తీసుకునే వ్యక్తికి సంబంధించిన వివరాలు తీసుకున్నారని, రిఫరెన్స్‌ కోసం వేరే ఇద్దరి కాంటాక్టు నంబర్‌లు అడిగారని వెల్లడించారు. లోన్‌ సకాలంలో చెల్లించకపోతే వడ్డీ ఎక్కువ పడుతుందని అనుకున్నామే గానీ, వాయిదా దాటిపోగానే ఒక చీటర్‌గా ముద్రవేస్తారని గానీ, కాంటాక్టులో ఉన్న వారి ఫోన్‌నంబర్లకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతారని గానీ, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతారని గానీ ఊహించలేదని వాపోయారు.  


రెండు అమ్మేసి.. 

ఇనెస్టెంట్‌ రుణ యాప్‌ల నిర్వహణలో అమెరికా నుంచి తిరిగొచ్చిన ఓ టెకీ రాటుదేలిపోయాడని, దాదాపు రూ.60 కోట్లు వెనకేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంజనీరింగ్‌లో మాస్టర్‌ చదివిన ఆ టెకీ కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేసి భారత్‌కు తిరిగొచ్చేశాడు. రెండు ఇన్‌స్టెంట్‌ లోన్‌ యాప్స్‌ తయారు చేసి ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలకు విక్రయించాడు.

ఇంకొన్నాళ్లకు మరో రెండు యాప్‌లను తయారు చేసి, వేరే ఫైనాన్స్‌ సంస్థ సహకారంతో తానే స్వయంగా నిర్వహిస్తూ ఇన్‌స్టెంట్‌ రుణాలిస్తున్నాడు. ఇలా రుణాలిస్తున్న ఇతర పైనాన్స్‌ సంస్థలకు రికవరీ చేసి పెట్టే బాధ్యతనూ అతడు తీసుకున్నట్లు గుర్తించారు. గచ్చిబౌలిలో ఓ కాల్‌ సెంటర్‌ను ఓపెన్‌ చేసి 120 మంది స్టాఫ్‌తో రికవరీ ఏజెంట్లను ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. 




ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు

బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ ప్రారంభించాం. ఇన్‌స్టెంట్‌ రుణాలు ఇస్తున్న హైదరాబాద్‌ బేస్డ్‌ కంపెనీలు రెండు ఉన్నట్లు గుర్తించాం. వెంటనే దాడులు నిర్వహించాం. 9 యాప్‌ల ద్వారా రుణాలు ఇస్తున్నట్లు గుర్తించాం. వారు యాప్స్‌ డెవల్‌పచేసిన వారితో, నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు.

ఇచ్చిన రుణాలను వసూలు చేసే క్రమంలో ఏజెంట్లు కస్టమర్‌ను వేధింపులకు గురిచేసి, అసభ్యకరంగా మాట్లాడి సమాజంలో పరువు తీస్తుండటంతో ఈ దందా వెలుగులోకి వచ్చింది.  పూర్తి ఆధారాలు సేకరించి లోతుగా విచారిస్తున్నాం. నిందితులను గుర్తించి అరెస్టు చేస్తాం.

-రోహిణి ప్రియదర్శిని, డీసీపీ క్రైమ్స్‌, సైబరాబాద్‌




వేధింపుల దశలు ఇలా.. 


మొదటి దశ: రుణం తీసుకున్నవారితో ఒక డేటా తయారవుతుంది. ఆ డేటాను మొదటి కన్సల్టెన్సీకి ఇస్తారు. వారేమో రుణం తీసుకున్న వారికి ఫోన్‌ చేసి, ‘మరో రెండు మూడు రోజుల్లో తీసుకున్న లోన్‌ చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొవల్సి ఉంటుంది’ అని హెచ్చరిస్తారు.  


రెండో దశ: రుణ వాయిదా 24గంటల్లో ముగుస్తుందనగా రెండో కన్సల్టెన్సీ ప్రతినిధులు రంగంలోకి దిగుతారు. ‘తీసుకున్న రుణం ఈ రోజు చెల్లించాల్సి ఉంది. వెంటనే చెల్లిస్తావా.. లేదా?’ అని గద్దిస్తారు. రెండో దశలో కూడా కలెక్షన్‌ ఏజెంట్లు చిన్న ఫోన్‌లే ఉపయోగిస్తారు. 


మూడో దశ: రుణం చెల్లించని వారిని ఫోన్‌ నంబర్లు, పేర్లు, ఫొటోలు, ఇతర కాంటాక్టులతో కూడిన జాబితా మూడో కన్సల్టెన్సీకి చేరుతుంది. వీరు రుణం తీసుకున్న వారితో మాట్లాడటానికి స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తారు. రుణం చెల్లించని వారికి ఫోన్‌ చేసి, ఇష్టానుసారంగా బూతులు తిడతారు. వారి ఫొటోను వారి తల్లిదండ్రులకు, స్నేహితులకు వాట్సాప్‌ చేసి వారిని మోసగాళ్లుగా, రుణాలు ఎగ్గొట్టే చీటర్లుగా చిత్రీకరించి అసభ్యకర మెసేజ్‌లు పెడతారు.


Updated Date - 2020-12-20T07:27:31+05:30 IST