వెయ్యి కేసులొచ్చినా రెడీ

ABN , First Publish Date - 2020-03-19T09:33:55+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ

వెయ్యి కేసులొచ్చినా రెడీ

ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రణాళిక

10వేల ఐసోలేషన్‌, 25వేల క్వారంటైన్‌ బెడ్స్‌ 

అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు

సెలవులిచ్చింది తిరగడానికి కాదు: ఈటల


ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకేసారి  వెయ్యి కేసులొస్తే ఏం చేయాలో కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. 10 వేల ఐసోలేషన్‌, 25 వేల క్వారంటైన్‌ పడకలు సిద్ధం చేశాం. రాష్ట్రానికి విదేశాల నుంచి 20 వేల మంది వస్తారని అంచనా వేశాం. వారందరికీ జిల్లాల్లో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. 

మంత్రి ఈటల రాజేందర్‌



హైదరాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఒకేసారి వంద కేసులొస్తే ఏం చేయాలి? వెయ్యి కేసులొస్తే ఏం చేయాలో కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు. 10 వేల ఐసోలేషన్‌, 25 వేల క్వారంటైన్‌ పడకలు సిద్ధం చేశామని తెలిపారు. తమకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పారు. ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చింది ఇంటి దగ్గర ఉండమనే కానీ బయట తిరిగేందుకు కాదన్నారు. మాల్స్‌కు, బంధువుల ఇళ్లకు, పెళ్లిళ్లకు, ప్రార్థనా మందిరాలకు వెళ్లవద్దని సూచించారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


కార్యాలయాల్లో శానిటైజర్లు పెట్టుకోవాలని, ఇళ్లలో సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలని సూచించారు. కొంతమంది ఎక్కడెక్కడో విమానాశ్రయాల్లో దిగి ఇక్కడకు వస్తున్నారని, అలా చేస్తే కరోనాను కట్టడి చేయడం కష్టమని అన్నారు. ఇటువంటి విషయాలను ఎవరైనా దాస్తే సమాజానికి ద్రోహం చేసిన వారవుతారని సున్నితంగా హెచ్చరించారు. కొంతమంది కరోనా లక్షణాలను దాచే ప్రయత్నం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారి విషయంలో కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. లేకపోతే పక్కవాళ్లైనా వైద్య సిబ్బందికి తెలపాలని సూచించారు. ఇలా దాచిపెట్టడం వల్ల ఇటలీలో ఏమైందో అందరికీ తెలుసునని గుర్తు చేశారు. ప్రజలు సహకరిస్తే, ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది పెట్టబోమని తెలిపారు. వైరస్‌ వచ్చాక ఏం చేయలేమని, రాకుండా జాగ్రత్త పడదామని కోరారు.


కలబుర్గిలో కరోనా వైరస్‌ సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లిన టోలిచౌకీకి చెందిన ముగ్గురి నమూనాలు నెగెటివ్‌ అని తేలిందని తెలిపా రు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారని తెలిపారు. అవసరమైతే రిటైర్డ్‌ వైద్య సిబ్బంది సేవలను వినియోగించుకుంటామన్నారు. విమానాశ్రయంలో నిరంతరం థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నామని, క్వారంటైన్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు 40 బస్సులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.   


జన్మదిన వేడుకలకు ఈటల దూరం

ఈ నెల 20న మంత్రి ఈటల పుట్టిన రోజు. కానీ, ఈసారి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ హైదరాబాద్‌ రావొద్దని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-03-19T09:33:55+05:30 IST