రిపేరుకు 2 నెలలు

ABN , First Publish Date - 2020-10-19T08:32:39+05:30 IST

కొన్నేళ్ల క్రితం చెన్నై, ఆ తర్వాత ముంబై... ఇప్పుడు హైదరాబాద్‌... రాజధాని నగరంలో కార్లకు నీటి గండం పట్టుకొంది. ఇప్పటికే హైదరాబాద్‌లో లక్షల సంఖ్యలో కార్లున్నాయి.

రిపేరుకు 2 నెలలు

నిక్కచ్చిగా చెబుతున్న మరమ్మతు సంస్థలు..

వరదలతో నీట మునిగిన వేలాది కార్లు

ఎంతవరకు మునిగింది అన్నదాన్ని బట్టి ఎన్ని రోజులు పడుతుందో చెబుతారు

కారు ధరలో 20-40% బిల్లు తప్పదు


హైదరాబాద్‌ సిటీ/బాలానగర్‌/చాదర్‌ఘాట్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కొన్నేళ్ల క్రితం చెన్నై, ఆ తర్వాత ముంబై... ఇప్పుడు హైదరాబాద్‌... రాజధాని నగరంలో కార్లకు నీటి గండం పట్టుకొంది. ఇప్పటికే హైదరాబాద్‌లో లక్షల సంఖ్యలో కార్లున్నాయి. వాటికితోడు లాక్‌డౌన్‌ ఎత్తేశాక భౌతికదూరం కోసం హైదరాబాద్‌ నగర వాసులు భారీ ఎత్తున కొత్త, సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొన్నారు. వందేళ్ల అత్యధిక వర్షపాతం కొద్ది గంటల్లోనే నమోదు కావడంతో... రోడ్లు, నాలాలు ఏకమై కార్లు పడవలై తేలిపోయాయి. అప్పు చేసి కార్లు కొనుక్కున్న వారు ఇప్పుడు నిర్వేదంలో మునిగిపోయారు. కారు పాడయిందన్న బాధ కన్నా ఇప్పుడు దాని మరమ్మతుకు ఒకటి రెండు నెలలు ఆగాల్సి వస్తుందన్న ఆందోళన వారిని కలవరపెడుతోంది. ముంబైలో వరదలు వచ్చి కార్లు నీటిలో మునిగితే తామున్నామంటూ భారీ స్థాయి ప్రకటనలిచ్చి ఆఫర్లను అందించిన సంస్థలేవీ హైదరాబాద్‌ వాసులను ఆదుకోవడానికి ముందుకు రాలేదు.


కారు చూడాలి... లెక్క చెప్పాలి

మంగళ, బుధ వారాల్లో కురిసిన వర్షాలకు చాలా కాలనీలు నీట మునిగాయి. శనివారం కూడా చాలాచోట్ల సాధారణ పరిస్థితి నెలకొనలేదు. వరద నీరు తగ్గిన చాలా చోట్ల బైక్‌లు, కార్ల స్థితి చేస్తే కన్నీటి వరదలే అయ్యాయి చాలామంది యజమానులకు. తప్పదు కదా అని కారు సర్వీస్‌ కేంద్రాలకు ఫోన్‌లు చేస్తే వచ్చిన సమాధానం వీరిని మరింత ఆందోళనలోకి నెట్టేస్తుంది. 30 నుంచి 60 రోజుల వెయిటింగ్‌ పీరియడ్‌ చెబుతున్నారు. కారు చూసిన తరువాత కానీ ఏమీ చెప్పలేమంటున్నారు. సనత్‌నగర్‌లోని సాయి సర్వీస్‌ సెంటర్‌ ప్రతినిధులు ఇదే విషయమై మాట్లాడుతూ, ‘‘జనరల్‌ సర్వీస్‌ అయితే ఉదయం కారు ఇస్తే సాయంత్రానికల్లా కారు ఇచ్చేస్తాం. కానీ వరదలో మునిగిన కారు అయితే చూడకుండా కారు ఎప్పుడు ఇస్తాం, ఎంతవుతుందనేది చెప్పలేం. మా దగ్గరకు ఈ తరహా ఎంక్వైరీలు బాగానే వస్తున్నాయి. వారందరికీ కూడా కారు చూసి, బీమా ఉందో లేదో తెలుసుకుని, ఖర్చు అంచనా చెప్పిన తరువాత, కారు యజమాని ఒప్పుకుంటేనే ఎప్పుడు కారు ఇవ్వగలమో చెబుతున్నాం. ఇంజిన్‌తో పాటుగా ఎలక్ట్రికల్స్‌ లాంటివి ఎంతమేరకు డ్యామేజీ అయ్యాయో కారు క్షుణ్ణంగా తనిఖీ చేస్తే కానీ తెలియదు’’ అన్నారు. సాధారణంగా నెల సమయం అడుగుతున్నామని చెప్పారు. మలక్‌పేటలోని మారుతి కంపెనీకి చెందిన వరుణ్‌ మోటర్‌ షోరూంలో 70కి పైగా వరద మునక కార్లు వచ్చాయి. వాటి మరమ్మతులకు 2-3 నెలల సమయం పడుతుందంటున్నారు.  ఫోర్డ్‌ ప్రతినిధులు కూడా ఇదే చెబుతున్నారు. తాము నెల రోజుల సమయం అడుగుతున్నామన్నారు. కారు వరద నీటిలో మునిగిపోయి ఉంటే కారు కాస్ట్‌లో కనీసం 20-40ు రిపేర్‌కు ఖర్చయ్యే అవకాశాలను కాదనలేమన్నది ఎక్కువ మంది మెకానిక్‌లు చెప్పేమాట.  


బీమా ఉంటే ఓకే... లేదంటే స్ర్కాపే!

నగరంలోని కార్ల సర్వీస్‌ సెంటర్లు వర్షాలకు మునిగిన కార్ల యజమానులను ఎడాపెడా వాయించేస్తున్నాయి. చాలా వరకు సర్వీస్‌ సెంటర్లు  నీట మునిగిన కార్లు అంటేనే.. బీమా ఉందా ? అని అడుగుతున్నాయి. బీమా ఉందంటే ఒకలా లేదంటే మరోలా కొటేషన్‌ ఇస్తున్నారు. మునిగిన కార్లను మూడు రకాలుగా విభజించి మరమ్మతు చేస్తున్నారు. కార్పెట్‌ లెవల్‌ వరకూ కారు మునిగి ఉంటే కార్పెట్‌ మార్పు తప్పనిసరి చేస్తున్నారు. గ్రీజింగ్‌, ఎలక్ట్రికల్‌ డ్యామేజీ తదితర కారణాలు చూపుతూ 15 రోజుల సమయం అడుగుతున్నారు. సీట్‌ లెవల్‌ వరకూ నీరు వస్తే లెదర్‌ ఛేంజ్‌, ఇంజిన్‌ చెక్‌, ఎలక్ట్రికల్స్‌ చెక్‌ అంటూ 20 రోజుల వ్యవధి అడుగుతున్నారు. డాష్‌బోర్డ్‌ వరకూ కారు నీటిలో మునిగి ఉంటే నెల నుంచి నెలన్నర, కారు పూర్తిగా మునగడం, బాడీకి డ్యామేజీ అయితే రెండు నుంచి మూడు నెలల సమయం అడుగుతున్నారు.


థర్డ్‌ పార్టీ బీమా అయితే మునిగినట్లే

ప్రీ ఓన్డ్‌ కార్లు కొనుక్కున్న వారు లేదంటే కారును మూడు నాలుగు సంవత్సరాలు వాడిన వారు థర్డ్‌ పార్టీ భీమా తీసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారు ఇప్పుడు మునిగిపోయే అవకాశాలే ఎక్కువంటున్నారు భీమా ఏజెంట్‌ రఘు. పూర్తి బీమా ఉంటే ఆదుకుంటుందన్నారు. సర్వీస్‌ సెంటర్లు ఎంత కొటేషన్‌ ఇచ్చినా బీమా సంస్థలు ఆడిట్‌ చేసి, అసలు మొత్తాలలో 80-90ు వరకూ ఇస్తాయని చెప్పారు. కార్ల మరమ్మతులకు సర్వీస్‌ సెంటర్లు ఇస్తున్న కొటేషన్స్‌ చూస్తే బీమా లేనివారు స్ర్కాప్‌లో వేసుకోవడమే ఉత్తమమని అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.


ఏం చేయాలి? ఏం చేయొద్దు?

కారు స్టార్ట్‌ చేయకూడదు: చాలామంది నీరు తగ్గిపోయిన తర్వాత కారు పనిచేస్తోందో లేదో చూద్దామని ఇంజన్‌ స్టార్ట్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది పెద్ద తప్పు. వేలల్లో అయ్యే బిల్లును లక్షల్లోకి మార్చుకోవడమే అవుతుంది. సాధారణంగా వరద నీటిలో మునిగిన కార్లు హైడ్రోలాక్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ తరహా కార్లకు ఖర్చు కూడా లక్షల్లోనే ఉంటుంది. కొన్నిసార్లు తుక్కులో వేయడమే మార్గం. 


త్వరగా బయటకు తీయాలి: కారు నీటిలో మునిగి ఉంటే త్వరగా దానిని బయటకు తీయాలి. సాధారణంగా వైరింగ్‌తో ఇబ్బంది వస్తుంది. వీలైనంత త్వరగా క్యాబిన్‌లో నుంచి నీరు బయటకు పోయేలా చేయాలి. నీటి నుంచి బయటకు తీసిన కారును డోర్లు అన్ని మూసి ఉంచడం కాకుండా డోర్లు అన్నీ తెరిచి గాలి ఉంచితే బాగుంటుంది. సహజ సిద్ధంగా సూర్యకాంతిలో ఆరనిస్తే మంచిది.


రిమోట్‌ ఆన్‌/ఆఫ్‌ చేయొద్దు: వరదలో మునిగిన కార్లను రిమోట్‌ ద్వారా ఆన్‌/ఆఫ్‌ చేసే ప్రయత్నం చేయరాదు. వరదలో ఉన్నప్పుడు బ్యాటరీలోకి నీరు చేరి ఆటోమెటిక్‌గా లైట్లు వెలగడం వంటివి జరిగితే ముందు జాగ్రత్తగా సైరన్‌మోగిస్తుంది. కొద్ది సేపటి తర్వాత బ్యాటరీ డౌన్‌కాగానే ఆగిపోతుంది. బ్యాటరీ డౌన్‌ కాగానే ఇంజన్‌కు కనెక్ట్‌ చేయబడిన వైర్లను తొలగించాల్సి ఉంటుంది. వరదలో మునిగితే వెంటనే కార్ల కంపెనీ షోరూంకు సమాచారం ఇవ్వాలి. త్వరగా సర్వీస్‌ సెంటర్లకు తరలించేందుకు అవకాశముంది. 


నీట మునిగితే కష్టాలే!

కారు  నీటిలో మునిగితే సమస్యలు తప్పవు. ఇంజిన్‌ నీటిలో మునిగినప్పుడు ఎయిర్‌ ఫిల్టర్‌ ద్వారా టర్బో ఎగ్జా్‌స్టలోకి చేరి పిస్టిన్‌ బిగుసుకుపోతుంది. దీని కారణంగా వైరింగ్‌లో కూడా సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు ఇంజిన్‌ పూర్తిగా తీసి రిపేర్‌ చేయాల్సి ఉంటుంది. ఇదంతా మరమ్మతు చేయాలంటే 15-20 రోజులు పడుతుంది. నీటిలో కొట్టుకు పోయిన లేదా నీట మునిగిన వాహనాలకు బీమా క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంది. బీమా సంస్థ నుంచి నివేదిక రావడానికి కొంత కాలం వేచి ఉండాల్సి వస్తోంది. ఇంజిన్‌ సమస్య లేకుండా ఉంటే రూ.30 నుంచి రూ.50 వేల వరకు ఖర్చు రావచ్చు. అదే  మేజర్‌ ఇంజిన్‌ సమస్య తలెత్తితే లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది.

పి.బాలకృష్ణ, సర్వీసింగ్‌ మేనేజర్‌, ఫోర్డ్‌  షోరూం, బాలానగర్‌


కార్ల యజమానుల కోసం హ్యుందాయ్‌ ‘రిలీఫ్‌ టాస్క్‌ఫోర్స్‌’

వరదల వల్ల నష్టపోయిన కార్ల యజయానులను ఆదుకునేందుకు హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) రిలీఫ్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని సంస్ధ సేల్స్‌, మార్కెటింగ్‌ అండ్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ తరుణ్‌ గార్గ్‌ వెల్లడించారు. ఇటీవలే హైదరాబాద్‌ నగరం ఊహించని రీతిలో వరద ప్రమాదాన్ని ఎదుర్కొందని, వరదల వల్ల నష్టపోయిన కార్ల యజమానులకు తాము సర్వీస్‌ సపోర్ట్‌ అందిస్తూ ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీంతో పాటుగా అత్యవసర రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ సర్వీస్‌ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. వరదల వల్ల ప్రభావితమైన కార్ల కోసం బీమా క్లెయిమ్‌లలో డిప్రిషియేషన్‌ మొత్తంలో 50ు రాయితీ అందిస్తున్నామని తెలిపారు. హ్యుందాయ్‌ వినియోగదారులు సహాయం కోసం 0124-2564 645 లేదా 1800 102 4645కు కాల్‌ చేయవచ్చని సూచించారు.

Updated Date - 2020-10-19T08:32:39+05:30 IST