వారోత్సవం అటు.. అవినీతి ఇటు!
ABN , First Publish Date - 2020-12-05T08:27:08+05:30 IST
అవినీతి నిర్మూలిద్దాం-దేశాన్ని అభివృద్ధి చేద్దాం్ అనే నినాదంతో అవినీతి నిరోధక శాఖ గురువారం నుంచి అవినీతి వ్యతిరేక వారోత్సవ కార్యక్రమం చేపట్టింది.
ఏసీబీ వలలో ముగ్గురు
మిర్యాలగూడ, గుండాల
ఆదిలాబాద్‌లలో పట్టివేత
హైదరాబాద్/గుండాల/ఆదిలాబాద్ టౌన్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ుఅవినీతి నిర్మూలిద్దాం-దేశాన్ని అభివృద్ధి చేద్దాం్ అనే నినాదంతో అవినీతి నిరోధక శాఖ గురువారం నుంచి అవినీతి వ్యతిరేక వారోత్సవ కార్యక్రమం చేపట్టింది. అధికారులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఓవైపు ఏసీబీ ఇంత కష్టపడుతుంటే.. మరోవైపు అవినీతి అధికారులు మాత్రం స్వేచ్ఛగా లంచాలు దిగమింగడంపైనే దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కేవలం 4గంటల వ్యవధిలో ముగ్గురు లంచగొండులను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ సైట్ ఇంజనీర్ రూ. 80వేలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారు. సూర్యాపేట జిల్లా నేరేడుగొమ్ము మండలం బచ్చాపురానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ కేతావత్ సోమ్లా నాయక్ పెద్దవూరలో ఎస్టీ హాస్టల్‌లో వాటర్ ట్యాంకు, మురుగు కాల్వ నిర్మాణం చేపట్టారు. రూ.4.25లక్షల బిల్లు మంజూరు కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ సైట్ ఇంజనీర్ ఇస్లావత్ స్వామినాయక్‌ను పలుమార్లు కలిశారు. రూ.లక్ష లంచం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తానని స్వామి డిమాండ్ చేశారు. సోమ్లా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదును అనుసరించి ఈ నెల 4న మిర్యాలగూడలో రెండ్ హ్యాండెడ్‌గా అధికారులు పట్టుకున్నారు.
రూ.40వేలు లంచం తీసుకున్న ఎస్‌ఐ
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన మహ్మద్ ఖాసిం రేషన్ బియ్యం అక్రమ దందా కొనసాగిస్తుంటాడు. అక్టోబరులో అతడిపై గుండాల ఎస్‌ఐ భూక్యా చందర్ కేసు నమోదు చేశారు. అనంతరం మహ్మద్ బెయిల్‌పై విడుదలయ్యాడు. అతడు వ్యాపారం స్వేచ్ఛగా చేసుకోవాలంటే తనకు రూ. 50వేలు వెంటనే ఇవ్వడమే కాక, ప్రతి నెలా రూ. 30వేలు సమర్పించుకోవాలని చందర్ డిమాండ్ చేశారు. మహ్మద్ వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. చందర్ సూచనల మేరకు గుండాల మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో ఉద్యోగిగా ఉన్న మైస గణేష్ అనే వ్యక్తికి రూ.40వేలు ఇచ్చాడు. అదే సమయంలో దాడులు నిర్వహించిన అధికారులు ఎస్‌ఐ చందర్‌ను అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా సీపీవో ఆఫీసు ఉప గణాంకాధికారిగా పని చేస్తున్న బి.ప్రదీప్ కుమార్ రూ.4వేల లంచం తీసుకుంటూ చిక్కారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలో 2018-19లో కాంట్రాక్టర్ శరత్ రూ.5లక్షల విలువ చేసే సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఎంపీడీవోకుపంపేందుకు శరత్ రూ.5వేలు ఇవ్వాలంటూ ప్రదీప్ డిమాండ్ చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సీపీవో ఆఫీసులో ప్రదీ్‌పకు శరత్ రూ.4వేల లంచం ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.