పాజిటివ్ రేటులో మూడో స్థానం
ABN , First Publish Date - 2020-06-18T10:07:52+05:30 IST
దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో కరోనా పాజిటివ్ రేటులో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. తొలి, రెండో స్థానాల్లో మహారాష్ట్ర

- దేశవ్యాప్తంగా 5.89.. తెలంగాణలో 12.16
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సేకరించిన నమూనాల్లో కరోనా పాజిటివ్ రేటులో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. తొలి, రెండో స్థానాల్లో మహారాష్ట్ర (16.52 రేటు), దేశ రాజధాని ఢిల్లీ (14.06 రేటు) నిలిచాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 6,86,488 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 1,13,445 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 3,04,483 పరీక్షలు చేయగా.. 48,688 మంది వైరస్ బారినపడ్డారు. ఇక తెలంగాణలో జూన్ 16 వరకు మొత్తం 44,431 పరీక్షలు నిర్వహించగా, అందులో 5406 మందికి వైరస్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో సేకరించిన నమూనాల్లో పాజిటివ్ రేటు 12.16గా నమోదైంది. దేశంలో చిన్న చిన్న రాష్ట్రాల కంటే కూడా అత్యంత తక్కువ పరీక్షలు నిర్వహించిన రాష్ట్రం తెలంగాణనే.
జూన్ 17 వరకు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో కేసుల సంఖ్య 5 వేలు దాటింది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి జూన్ 16 వరకు ఆయా రాష్ట్రాలు 2 లక్షల పైచిలుకు పరీక్షలు చేశాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 60,84,256 నమూనాలు సేకరించగా.. అందులో 3,58,546 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో దేశ సగటు పాజిటివ్ రేటు 5.89గా నమోదైంది. ఇక సేకరించిన నమూనాల్లో పాజిటివ్ రేటులో మిగిలిన రాష్ట్రాల విషయానికొస్తే.. నాల్గో స్థానంలో గుజరాత్(8.03).. ఆ తర్వాత స్థానాలో తమిళనాడు (6.04), బిహార్ (5.26) హరియాణా (4.19), మధ్యప్రదేశ్(4.19), పశ్చిమ బెంగాల్ (3.3) పదో స్థానంలో ఉత్తరప్రదేశ్ (3.02) నిలిచాయి.
విస్తృతంగా పరీక్షలు చేస్తే.. రెండో స్థానంలో..
రాష్ట్రంలో విస్తృత స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే దేశంలో మహారాష్ట్ర తర్వాత అత్యధిక పాజిటివ్ కేసులు తెలంగాణలోనే ఉండేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సేకరించిన నమూనాల ప్రకారం.. రాష్ట్రంలో పెద్దఎత్తున కేసులు బయటపడతాయంటున్నారు. తాజాగా ప్రభుత్వం 50 వేల పరీక్షలు చేయిస్తున్న నేపథ్యంలో పాజిటివ్ రేటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. జూన్ 6న పాజిటివ్ రేటు 33ు నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో వైరస్ వ్యాపి చాలా తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం కేసుల్లో 70ు ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నాయి.