కొలువున్నా.. నిరుద్యోగులే!

ABN , First Publish Date - 2020-06-23T10:01:24+05:30 IST

గ్రూప్‌-2లో ఉన్నత ఉద్యోగం.. చిన్న వయసులో ఆ కొలువు వస్తే.. సర్వీసుకాలంలో కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ కూడా అయ్యే అవకాశం ఉంది! గ్రూప్‌-2లో 13 కేటగిరీల పోస్టులుండగా.. వాటిని కాదనుకొని కేవలం ఇదే పోస్టును ఏరికోరి

కొలువున్నా.. నిరుద్యోగులే!

హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-2లో ఉన్నత ఉద్యోగం.. చిన్న వయసులో ఆ కొలువు వస్తే.. సర్వీసుకాలంలో కన్‌ఫర్డ్‌ ఐఏఎస్‌ కూడా అయ్యే అవకాశం ఉంది! గ్రూప్‌-2లో 13 కేటగిరీల పోస్టులుండగా.. వాటిని కాదనుకొని కేవలం ఇదే పోస్టును ఏరికోరి తీసుకున్నవారికి కన్నీళ్లే మిగిలాయి. అగ్రస్థానంలో ఉండే కొలువులు ఎంచుకున్నప్పటికీ నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు తీసుకొని, 2 నెలల పాటు శిక్షణ కూడా తీసుకున్నా.. విధుల్లో చేరడం గగనంగా మారింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో తొలుత వీరిని పక్కనపెట్టగా.. తాజాగా కరోనా సంక్షోభంతో వారి సంగతే మరిచిపోయారు. వారే డిప్యూటీ తహసీల్దార్లు! 2015లో టీఎ్‌సపీఎస్సీ 1032 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. దీనికి 7.89 లక్షల మంది పోటీపడ్డారు. అంతిమంగా అన్ని వివాదాలు దాటుకొని 1027 మందిఎంపికయ్యారు. ఆర్థిక శాఖలో 7నెలల కిందటే పోస్టింగులు ఇవ్వగా, 5 నెలల కిందట న్యాయశాఖ, సాధారణ పరిపాలన శాఖలు అభ్యర్థులకు పోస్టింగులు ఇచ్చేశాయి. అయితే డిప్యూటీ తహసీల్దార్లకు ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వలేదు. పోస్టింగులు ఇస్తేనే వేతనం వస్తుంది. దాంతో కొలువులు వచ్చాయని గతేడాది అక్టోబరులోనే చిన్నాచితక ఉద్యోగాలు చేసుకునేవారంతా వాటిని వదిలేసుకొని ఈ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. 8 నెలలుగా పోస్టింగులు లేక, జీతం చేతికి రాక పస్తులు ఉండాల్సిన పరిస్థితి.  రాష్ట్రంలో 2016 సెప్టెంబరు నుంచి పూర్తిస్థాయిలో భూపరిపాలన ప్రధా న కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పోస్టు ఖాళీగా ఉంది. సీసీఎల్‌ఏ స్థాయిలోనే నియామకాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం ఈ పోస్టును ఖాళీగా ఉంచడంతో డిప్యూటీ తహసీల్దార్ల బతుకు దుర్భరంగా మారింది.   ఇక డిప్యూటీ తహసీల్దార్లంతా మంత్రి కేటీఆర్‌ను కలిసి పలుమార్లు విజ్ఞప్తు లు చేశారు. ఆయన ఆదేశాలిచ్చినా పోస్టింగులు రాకపోవడం గమనార్హం.

Read more