వారుగానీ కన్నేశారంటే ఖాళీ స్థలాలు కబ్జా
ABN , First Publish Date - 2020-12-13T08:28:34+05:30 IST
వారు గానీ కన్నేశారంటే.. ఖాళీ స్థలాలు పకడ్బందీగా కబ్జా అయిపోతాయి. పాత దస్తావేజులతో.. ఆ భూములకు సంబంధించి డాక్యుమెంట్లు సిద్ధం చేస్తారు. ఒకటి కాదు..

పాత దస్తావేజులతో నకిలీ పత్రాలు
వంద ఏళ్లకు లింక్ డాక్యుమెంట్లు సిద్ధం
ముఠా ఆటకట్టించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
ఏడుగురికి బేడీలు.. పరారీలో మరో ఏడుగురు
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): వారు గానీ కన్నేశారంటే.. ఖాళీ స్థలాలు పకడ్బందీగా కబ్జా అయిపోతాయి. పాత దస్తావేజులతో.. ఆ భూములకు సంబంధించి డాక్యుమెంట్లు సిద్ధం చేస్తారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద ఏళ్లకు కూడా లింక్ డాక్యుమెంట్లు సృష్టించేస్తారు. తామే అసలు యజమానులమంటూ అమాయకులకు ఆ భూముల్ని అమ్మేస్తారు.ఇలా.. మోసాలకు పాల్పడుతున్న ఘరానా ముఠాలోని ఏడుగురిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.
శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరాలు వెల్లడించారు. భవానీనగర్‌కు చెందిన మీర్ షకీర్ అలీ.. చాంద్రాయణగుట్టకు చెందిన అలీ-బిన్-మహమ్మద్ జాబ్రీ, మహమ్మద్ వసీ అలియాస్ స్వీటీ, భవానీనగర్‌కు చెందిన సైఫ్‌యాఫీ, సలాం హమ్దీ, అబ్దుల్లా మసూద్, మహమ్మద్ ముజీబ్‌ఖాన్, సంతో్‌షనగర్‌కు చెందిన సయ్యద్ కరామత్ హుస్సేన్, కాలాపత్తర్‌కు చెందిన వహీద్, జహానుమాకు చెందిన మహమ్మద్ ఫజల్ షరీఫ్, కిషన్‌బాగ్‌కు చెందిన మహమ్మద్ ఖాన్, యాకుత్‌పుర నివాసి ఫరీద్‌ఖాన్, శాలిబండకు చెందిన హంసుద్దీన్, మైలార్‌దేవ్‌పల్లికి చెందిన అజహార్ అహ్మద్‌తో ఓ ముఠాను ఏర్పాటు చేశాడు.
అలీ-బిన్-మహమ్మద్, మహమ్మద్ వసీలు ఖాళీ స్థలాలకు చెందిన సమాచారాన్ని సేకరించి. షకీర్‌కు అందజేస్తారు. అతడు ముజీబ్ ద్వారా.. పాతనాన్ జ్యుడీషియల్ బాండ్ పేపర్లను సేకరిస్తుంటాడు. ఓ ప్రత్యేక ద్రావణంతో వాటిపై ఉన్న రాతలను తొలగించి.. ఖాళీ దస్తావేజులను తయారు చేస్తుంటాడు. దాని ఆధారంగా.. సంబంధిత ఖాళీ స్థలం హుస్సేన్, ఫరీద్‌ఖాన్, అహ్మద్‌దేనని పేర్కొంటూ నకిలీ పత్రాలు సృష్టిస్తాడు. అమాయకులకు ఆ భూమిని అమ్మేస్తారు.
ఇదే ముఠాలోని సైఫ్‌యాఫీ, సలాం హందీ, అబ్దుల్లా మహమ్మద్.. అసలు యజమానులకు ఆ పత్రాలు చూపి, బెదిరింపులకు పాల్పడేవారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. శనివారం ఏడుగురిని అరెస్టు చేసి.. 92నకిలీ దస్తావేజులు, 30 రబ్బరు స్టాంపులు, రూ.2.10లక్షలు స్వాధీ నం చేసుకున్నారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.