థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఓ మిథ్య

ABN , First Publish Date - 2020-06-06T09:26:24+05:30 IST

రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఓ మిథ్యగా మారింది. నిబంధనల ప్రకారం.. రైలు ఎక్కే ప్రయాణికులను రైల్వేశాఖకు ..

థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఓ మిథ్య

రైలు దిగే ప్రయాణికులకు తనిఖీలే లేవు


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఓ మిథ్యగా మారింది. నిబంధనల ప్రకారం.. రైలు ఎక్కే ప్రయాణికులను రైల్వేశాఖకు చెందిన వైద్య సిబ్బంది థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తారు. రైలు దిగే ప్రయాణికులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల వైద్యాధికారులు, సిబ్బంది పరీక్షించాలి. అనుమానితులకు క్వారంటైన్‌ ముద్రవేసి, సమీప ఆస్పత్రికి తరలించాలి. రైల్వేశాఖ తరఫున ప్రయాణికుల స్ర్కీనింగ్‌ యథావిధిగా కొనసాగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది మాత్రం సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


నిబంధనల ప్రకారం రైల్వేశాఖ అధికారులు ప్లాట్‌ఫారాల వద్ద భౌతిక దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లను అందుబాటులో పెట్టి.. ప్రయాణికుడు రైలు దిగేవరకు వారి కదలికలను, ఆరోగ్య పరిస్థితిని గమనిస్తోంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలను పూర్తిగా విస్మరిస్తున్నారు. రైళ్లు ప్రారంభమైన జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు ఏ రైల్వేస్టేషన్‌లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్ర్కీనింగ్‌ కౌంటర్లను ఏర్పాటు చేయలేదు. దీంతో.. స్టేషన్లలో దిగుతున్న కరోనా అనుమానిత/లక్షణాలున్న ప్రయాణికులు నేరుగా తమ స్వస్థలాలకు వెళ్తున్నారు.

Updated Date - 2020-06-06T09:26:24+05:30 IST