రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదు

ABN , First Publish Date - 2020-06-16T09:33:14+05:30 IST

రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఉద్దేశం లేదని ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ఎక్కువ కేసులు

రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదు

  • వైరస్‌ వ్యాప్తి తెలుసుకునేందుకే 50 వేల కరోనా పరీక్షలు
  • రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి లేదు
  • హైదరాబాద్‌లో ఫీవర్‌ సర్వే
  • వైద్యమంత్రి ఈటల వెల్లడి
  • రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు
  • కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చం: ఈటల

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించే ఉద్దేశం లేదని ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ఎక్కువ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఏ మేరకు కరోనా వ్యాప్తి జరుగుతోందో తెలుసుకునేందుకే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.  సోమవారం కోఠీలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆయన మీడియా సమావేశంలో  మాట్లాడారు. రాష్ట్రంలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను తు.చ తప్పక పాటించామన్నారు. లాక్‌డౌన్‌ అమలు చేయడం వల్ల తెలంగాణలో వైరస్‌ సామాజిక వ్యాప్తి జరగలేదని ఐసీఎంఆరే తేల్చి చెప్పిందని మంత్రి వెల్లడించారు. వారం, పది రోజుల్లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తామని, వచ్చే ఫలితాలను బట్టి ఇంకా పరీక్షలు చేయాలా? వద్దా? అనేది నిర్ణయిస్తామని తెలిపారు.


త్వరలోనే హైదరాబాద్‌లోని ప్రతి ఇంటికీ ఫీవర్‌ సర్వే చేస్తామని ప్రకటించారు. దీనికోసం అదనపు సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకుంటామన్నారు. ఇక కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చబోమని స్పష్టం చేశారు. కాగా, దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ చాలా బెటర్‌ అని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అన్నారు. నగరంలో పరిస్థితి కంట్రోల్‌లోనే ఉందన్నారు. టెస్టులు చేయడం లేదన్న అపోహలు వస్తున్నందునే పరీక్షలు పెంచామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు ప్రజల్లో భయం పుట్టిేస్త కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, కరోనాకు సరిగ్గా 7రోజులు చికిత్స తీసుకుంటే చాలునని, లక్షణాలు లేని పాజిటివ్‌ రోగులు ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతకుమారి అన్నారు. ప్రజలు అనవసరంగా డబ్బు వృథా చేసుకోవద్దని సూచించారు. ప్రజారోగ్య సంచాలకులు గడల శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. 


నాణ్యమైన భోజనం కోసం కమిటీ 

గాంధీ ఆస్పత్రితోపాటు ఇతర ఆస్పత్రుల్లోని రోగులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు డైటీషియన్లతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఈటల ప్రకటించారు. ఉదయం టిఫిన్‌, 11 గంటలకు టీ, బిస్కెట్లు, మధ్యాహ్నం లంచ్‌, సాయంత్రం డ్రైఫ్రూట్స్‌, రాత్రి భోజనం అందించేందుకు ఎంత ధర అవుతుందో నిర్ణయించాలని కోరారు. దీనిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అలాగే, రాష్ట్రంలో 4వేల పరీక్షలు చేసే సామర్థ్యం ప్రభుత్వ ల్యాబ్‌లకు ఉందని, రోజ్‌ కంపెనీ మిషన్‌ వస్తే రోజుకు 3500 పరీక్షలు చేసే కెపాసిటీ పెరుగుతుందని మంత్రి వెల్లడించారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కరోనా రోగులను ఉంచితే వారికి అందించాల్సిన సౌకర్యాలపై అధికారులతో ఈటల చర్చించారు. 

Updated Date - 2020-06-16T09:33:14+05:30 IST