కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే

ABN , First Publish Date - 2020-12-29T07:05:24+05:30 IST

పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కాలంటే కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పంటల కొనుగోళ్లలోనూ లాభనష్టాలు చూసుకునే దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని

కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే

పంటల కొనుగోళ్లలో లాభనష్టాలు చూసుకునే

దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం: ఉత్తమ్‌

సాగును మోదీకి తాకట్టుపెట్టిన కేసీఆర్‌: భట్టి

సీఎంపై సీబీఐ విచారణ జరపాలి: జీవన్‌రెడ్డి

రైతుల నోట్లో మట్టి కొట్టే యత్నం: కోమటిరెడ్డి

కేసీఆర్‌ శేష జీవితం చర్లపల్లి జైల్లోనే..: పొన్నాల

రాష్ట్ర వ్యాప్తంగా  కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం


హైదరాబాద్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కాలంటే కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రైతులకు న్యాయం జరిగే వరకూ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. పంటల కొనుగోళ్లలోనూ లాభనష్టాలు చూసుకునే దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గాంధీభవన్‌లో పార్టీ జెండాను ఉత్తమ్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ప్రజల మధ్యే ఉండి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో 136 ఏళ్లపాటు ప్రజాస్వామ్య బద్ధంగా మనుగడ సాగించిన ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని పేర్కొన్నారు.


కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రజలను మోసగిస్తూ లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. పంటల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తూ రైతుల నోట్లో మట్టికొట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు మోదీని తిట్టి, రైతుల బంద్‌కు మద్దతు తెలిపిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే వ్యవసాయ చట్టాలను అమలు చేయడం సిగ్గుచేటని ఓ ప్రకటనలో విమర్శించారు. తన అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే కేసీఆర్‌.. మోదీ పంచన చేరారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నూతన సాగు చట్టాల అమలును విరమించుకోకుంటే రైతు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మద్దతు ధరకు కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను తిరిగి విక్రయించే క్రమంలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని షబ్బీర్‌ అలీ ఆరోపించారు.


దీనిపై విచారణ జరిపిస్తే అన్నీ బయటకు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్‌.. తుగ్లక్‌ను మరిపిస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధ్వజమెత్తారు. ఆయన జైలుకు వెళ్లకుండా ఉండేందుకే రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ నిర్ణయాల్లో 90 శాతం ప్రజల్ని ఇబ్బంది పెట్టేవేనని, ఆయన రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోనున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. తుగ్లక్‌ ఏం పుణ్యం చేసుకున్నాడో ఏమో కానీ.. కేసీఆర్‌ పనుల వల్ల ప్రతి రోజూ ఆయనను గుర్తు చేసుకోవాల్సి వస్తోందని వ్యగ్యంగా అన్నారు. రైతుల నుంచి ప్రతి గింజా కొంటామని చెప్పి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఎత్తేయడం దారుణమని, ఇది కొత్త సాగు చట్టాలకు అనుకూలం కాదా?అని ప్రశ్నించారు. కేసీఆర్‌ శేషజీవితం చర్లపల్లి జైల్లో గడపక తప్పదని అన్నారు. కాగా, కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలన్న నిర్ణయంపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు గాంధీ భవన్‌లో మంగళవారం కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీ బెదిరింపులకు సీఎం కేసీఆర్‌ లొంగిపోయారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. 


మోదీకి లొంగిపోయిన కేసీఆర్‌: భట్టి

ఖమ్మం: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడతానని ప్రకటించిన కేసీఆర్‌.. నాలుగు రోజుల్లోనే యూటర్న్‌ తీసుకుని తెలంగాణ వ్యవసాయాన్ని మోదీకి తాకట్టు పెట్టారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. కేసులకు, జైలుకు భయపడి మోదీకి లొంగిపోయారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఖమ్మంలో ‘కాంగ్రెస్‌ కవాతు’ పేరుతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ ‘ఇష్టం వచ్చిన పంట వేయండి, ఇష్టం వచ్చినచోట అమ్ముకోండి’ అని ప్రభుత్వం ప్రకటించడం  దారుణమని అన్నారు. కేంద్రానికి అనుకూలంగా కేసీఆర్‌ మాట్లాడడం వెనుక కేసుల భయం కనిపిస్తోందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకునే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 


కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరపాలి: జీవన్‌రెడ్డి

జగిత్యాల: బీజేపీకి దమ్ముంటే సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జగిత్యాలలో పార్టీ జెండాను ఆవిష్కరించిన తర్వాత ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ ఓ మేకవన్నె పులి అని, ఆయన నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. కేసీఆర్‌ తన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే, ప్రధాని మోదీ దగ్గర రైతుల జీవితాలను తాకట్టు పెట్టాడని ఆరోపించారు. బీజేపీకి దమ్ముంటే కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో సోదాలు చేయించాలని సవాల్‌ విసిరారు. 

Updated Date - 2020-12-29T07:05:24+05:30 IST