నేను లేనిదే తెలంగాణ లేదు

ABN , First Publish Date - 2020-12-11T07:45:00+05:30 IST

‘‘సిద్దిపేట పేరులోనే బలమున్నది, ఇది మామూలు ప్రాంతం కాదు.. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేనిదే తెలంగాణ

నేను లేనిదే తెలంగాణ లేదు

సిద్దిపేట లేకపోతే నేను లేను.. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ ఇది.. డైనమిక్‌ ప్లేస్‌

హైదరాబాద్‌ స్థాయిలో అభివృద్ధి.. మిషన్‌ భగీరథ అచ్చంగా సిద్దిపేట స్కీమే

అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును ఇక్కడకు తెస్తా.. మీకు ఆణిముత్యంలాంటి హరీశ్‌ను ఇచ్చా

ఆ పిల్లోడు నా పేరును కాపాడి సంతోషం నింపిండు: సీఎం కేసీఆర్‌

ఐటీ టవర్‌కు భూమి పూజ.. టీఆర్‌ఎస్‌ భవన్‌, రైతు వేదిక ప్రారంభం

960 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన, ప్రభుత్వ వైద్య కాలేజీ ప్రారంభం

సిద్దిపేటకు మరిన్ని వరాలు.. మరో 1000 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు


సిద్దిపేటలో డబుల్‌ బెడ్రూం ఇళ్లను అన్ని హంగులతో నిర్మించాం. దేశానికే రోల్‌మోడల్‌గా ఉన్నాయి. ప్రతి ఇంటికీ పైపులైన్‌తో గ్యాస్‌, నల్లా కనెక్షన్లు, విశాలమైన రోడ్లు, కమ్యూనిటీ భవనాలను చూస్తుంటే మరో ప్రత్యామ్నాయ పట్టణంగా అనిపిస్తోంది. ఆ ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తుంటే వారి ఆనందానికి అవధుల్లేవు. ఈ ఇళ్లను చూడగానే నేను ఉద్వేగానికి లోనైన. - కేసీఆర్‌


సిద్దిపేట, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘‘సిద్దిపేట పేరులోనే బలమున్నది, ఇది మామూలు ప్రాంతం కాదు.. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేనిదే తెలంగాణ లేదు. సిద్దిపేట ఎమ్మెల్యేగా నేను రాజీనామా చేసి కరీంనగర్‌ ఎంపీగా ఢిల్లీకి పోతుంటే మీరంతా కన్నీళ్లు పెట్టుకున్నరు. ఇప్పుడు సిద్దిపేట పేరును నిలబెట్టిన. మీ ఆశీస్సులతోనే తెలంగాణ తెచ్చిన. ముఖ్యమంత్రి అయిన. నేనున్నా, లేకున్నా ఈ కీర్తి సిద్దిపేటకే దక్కుతుంది’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు.


సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులోని నాగులబండ వద్ద ఐటీ టవర్‌ నిర్మాణం కోసం భూమి పూజ, సిద్దిపేట శివారులోని నర్సాపూర్‌ వద్ద డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సహా పలు ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4:30వరకు పర్యటించారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సిద్దిపేట డైనమిక్‌ ప్లేస్‌ అని, హైదరాబాద్‌కు సమాన స్థాయిలో అభివృద్ధి చెందుతున్న పట్టణమని అభివర్ణించారు.
ఈ సందర్భంగా తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న రోజుల నుంచీ ఆ పట్టణంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ స్థాయి రింగురోడ్డు కోసం స్థానిక నాయకులతో కలిసి సైకిల్‌ మోటార్ల మీద తిరిగానని.. చెట్ల పొంటి నడిచానని.. గుట్టలను ఎక్కానని చెప్పారు. అప్పుడు రింగురోడ్డు ఎందుకు? అని కొందరు ప్రశ్నించారని.. దాని అవసరం ఏమిటనేది ఇప్పుడు తెలిసిందని అన్నారు. రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన రోజుల్లో తనను కలెక్టర్‌, ఇతర అధికారులు చెట్ల కిందనే కలిసిన రోజులు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. మిషన్‌ భగీరథ పథకం అచ్చంగా సిద్దిపేట స్కీం అని కేసీఆర్‌ అన్నారు.


‘‘ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీళ్లు అందిస్తున్న మిషన్‌ భగీరథ పథకాన్ని ఎక్కడో అమెరికా నుంచి తీసుకురాలే. ఇది అచ్చంగా సిద్దిపేట పథకం. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిద్దిపేట పట్టణంలోని 28 వార్డులుంటే ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడేవి కావు. ట్యాంకర్ల వద్ద ఒకటే లొల్లులు, పంచాయితీలు. అందుకే లోయర్‌ మానేరు డ్యామ్‌ నుండి సిద్దిపేటకు అప్పట్లోనే మంచినీళ్లు తెచ్చాను. అదే స్కీమ్‌ను తెలంగాణ అంతటా అమలు చేసినం. ఇదొక్కటే కాదు ఎన్నో స్కీములను  ప్రవేశపెట్టి దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిపాను’’ అని పేర్కొన్నారు. 


అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు

సిద్దిపేట శివారులో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ‘‘తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు హైదరాబాద్‌కు అటువైపుగా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ఉంది. మరో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కావాలి. అది హైదరాబాద్‌కు ఇటువైపుగా అంటే శామీర్‌పేట ఇవతల రావొచ్చు. సిద్దిపేట కూడా ఒకప్పటిలా లేదు. లక్షల జనాభాకు కేంద్రంగా మారింది. ఈ పట్టణం అద్భుతంగా మారి అంతర్జాతీయ స్థాయికి చేరుతుంది. పర్యాటకంగా, వ్యాపారపరంగా, అభివృద్ధి పరంగా ముందుకెళుతోంది. ఈ పట్టణానికి ఈశాన్యం కలిసొచ్చింది’’ అని కేసీఆర్‌ అన్నారు. హరీశ్‌..  హుషారైన నాయకుడు 

మంత్రి హరీశ్‌ రావు హుషారైన నాయకుడని, గట్టివాడని, బాగా పనులు చేస్తాడంటూ కేసీఆర్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘సిద్దిపేటకు రావాలంటూ నన్ను హరీశ్‌ ఆహ్వానించాడు. ఎలాంటి కోరికలు కోరనన్నాడు, తీరా ఇక్కడకు వచ్చి మీ అందరి ముందు నిలబెట్టి అన్నీ అడుగుతున్నాడు, దొడ్లోకి వచ్చిన బర్రె పేడ పెట్టకుండా వెళ్లదని గ్రహించాడు. సిద్దిపేటను చూసి అందరూ నేర్చుకోవాలనే అంతంగా పట్టణాన్ని తీర్చిదిద్దాడు.  అవినీతి జరగదు.. ప్రజాధనాన్ని సద్వినియోగం చేసుకుంటాడు..  ఏదైనా వరాలు ఇస్తే వెంటనే కళ్లముందు ఆ పని కనిపించేలా చేస్తాడు. నా ప్రాణం లాంటి సిద్దిపేటకు ఆణిముత్యం లాంటి నాయకుడిని అప్పగించిన. ఆ పిల్లోడు నా పేరు కాపాడిండు. నా కలలు నెరవేర్చి.. నా గుండెల నిండా సంతోషాన్ని నింపిన హరీశ్‌ను ఆశీర్వదిస్తున్నా’’అని కేసీఆర్‌ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. కోమటిచెరువు కట్ట పనిని తాను మొదలుపెడితే దాన్ని అత్యంత సుందర ప్రదేశంగా హరీశ్‌ తీర్చిదిద్దాడని సీఎం పేర్కొన్నారు. 


సిద్దిపేటకు వరాలే వరాలు

సిద్దిపేటపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. ఆ నియోజకవర్గానికి మరో వెయ్యి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆడిటోరియం నిర్మాణానికి రూ. 50 కోట్లు ప్రకటించారు.  ఇర్కోడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు, సిద్దిపేట నుంచి ఇల్లంతకుంటకు ఫోర్‌లేన్‌ రోడ్డు, రాజీవ్‌ రహదారి నుంచి రాజీవ్‌ రహదారికి 75 కిలోమీటర్ల రింగురోడ్డు, కోమటిచెరువు అభివృద్ధికి రూ.25 కోట్లు, రంగనాయకసాగర్‌ పర్యాటక రంగం కోసం రూ.100 కోట్లు ప్రకటించారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లలో బస్తీ దవాఖానా, సిద్దిపేటలో త్రీ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ కోసం అనుమతి ఇచ్చారు. వరాలన్నీ కురిపించిన తర్వాత.. ‘‘మరి నిధులు ఇస్తారా మా సిద్దిపేటకు’’ అంటూ వేదికపై ఉన్న మంత్రులు ఈటల రాజేందర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డిలను ఉద్దేశించి ప్రశ్నించడంతో సభలో నవ్వులు విరిశాయి. కాగా తన ప్రసంగంలో కేసీఆర్‌ ఎక్కడా రాజకీయ విమర్శలు చేయకపోవడం విశేషం. 
ఐదుగంటలపాటు పర్యటనలో.. 

సిద్దిపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌, ఐదు గంటల పాటు పర్యటించి పది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దుద్దెడ వద్ద రూ.45కోట్లతో నిర్మించతలపెట్టిన ఐటీ టవర్‌కు భూమిపూజ చేశారు. పొన్నాల శివారులో నిర్మించిన టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. మిట్టపల్లిలో నిర్మించిన రైతువేదికను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటుచేసిన మిట్టపల్లి పప్పుల తయారీ స్టాల్‌ను సందర్శించారు. సిద్దిపేట శివారులో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. అక్కడే 960 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి భూమిపూజ చేశారు. అనంతరం పట్టణంలోని కోమటిచెరువును సందర్శించారు. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న నెక్లెస్‌ రోడ్డుపై దాదాపు 1.5 కిలోమీటర్లు నడిచారు. చెరువు వద్ద చేయాల్సిన పనులపై సూచనలు ఇచ్చారు. పట్టణంలో రూ.278 కోట్లతో నిర్మిస్తున్న అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి సంబంధించిన మురికినీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నడిబొడ్డున ఏర్పాటు చేసిన గెస్ట్‌హౌ్‌సను ప్రారంభించారు. రిజర్వాయర్‌ నీళ్లను చూస్తూ మధ్యాహ్న భోజనం చేశారు.  


నాలుగు కంపెనీలతో ఎంవోయూ 

  సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ శివారులోని నాగులబండ వద్ద ఐటీ టవర్‌ నిర్మాణం కోసం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. అనంతరం ఐటీ కంపెనీల ప్రతినిధులతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన ఎంవోయూ పత్రాలను అందజేశారు. కాగా ఐటీ టవర్లలో పని చేసేందుకు నాలుగు ఐటీ కంపెనీలు ముందుకొచ్చాయి.  అమెరికాకు చెందిన జోలన్‌ టెక్నాలజీ, ఇస్కాన్‌ టెక్‌, ఎమ్‌ రోడ్స్‌, నెట్‌ విజన్‌ కంపెనీల ప్రతినిధులకు కేసీఆర్‌ ఎంవోయూలను అందజేశారు. 300 మందితో, 3 షిఫ్టుల్లో మొత్తం 900 మంది ఐటీ ఉద్యోగులు సేవలు అందిస్తారని టీఎ్‌సఐసీ ప్రతినిధి తెలిపారు.  Updated Date - 2020-12-11T07:45:00+05:30 IST