తప్పు చేసినా శిక్ష పడదులే!

ABN , First Publish Date - 2020-12-10T10:15:15+05:30 IST

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం లేదని, తప్పు చేసి ఏసీబీకి చిక్కినా శిక్ష పడదన్న ధీమా నెలకొందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎ్‌ఫజీజీ) పేర్కొంది. కష్టపడి కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు

తప్పు చేసినా శిక్ష పడదులే!

ఏసీబీకి చిక్కినా భయపడని ప్రభుత్వ ఉద్యోగులు

పెండింగ్‌లో 300 ట్రాప్‌, డీఏ కేసుల ఫైళ్లు

దర్యాప్తు జరపాలని సీఎ్‌సను ఆదేశించండి

గవర్నర్‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ


హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో భయం లేదని, తప్పు చేసి ఏసీబీకి చిక్కినా శిక్ష పడదన్న ధీమా నెలకొందని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎ్‌ఫజీజీ) పేర్కొంది. కష్టపడి కేసులు నమోదు చేసిన ఏసీబీ అధికారులు చర్యలకు ప్రభుత్వ అనుమతి కోరితే సెక్షన్‌ అధికారులు కేసును నీరుగారుస్తున్నారంటూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి బుధవారం లేఖ రాశారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడే ఉద్యోగులపై చర్య తీసుకోవాలని సీఎ్‌సను ఆదేశించాలంటూ లేఖలో కోరారు. ట్రాప్‌, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ, హోం, మునిసిపాలిటీ, రవాణా తదితర శాఖల్లో 300కు పైగా అవినీతి అధికారుల కేసులు సచివాలయంలో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.


సచివాలయంలో ఏసీబీ డైరెక్టర్‌ నివేదిక కంటే సెక్షన్‌ అధికారి నోట్‌కు ఎక్కువ విలువ ఉంటోందన్నారు. సచివాలయంలోని అన్ని శాఖల్లో గల ఏసీబీ కేసులపై సీఎస్‌ సమీక్ష నిర్వహించేలా ఆదేశించాలని కోరారు. అవినీతి అధికారులపై ప్రభుత్వం సరైన సమయంలో చర్యలు తీసుకోకపోవడంతో లంచం కేసుల్లో కొందరు రెండు, అంతకంటే ఎక్కువ సార్లు ఏసీబీకి పట్టుబడుతున్నారని వివరించారు. రవాణా శాఖలో విధులు నిర్వహించే జె.నరేందర్‌ రూ.8 వేలు లంచం తీసుకుంటూ 2016లో ఏసీబీకి పట్టుబడ్డారు. విచారణలో ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించి డీఏ కేసు కూడా నమోదు చేశారు. ట్రాప్‌, డీఏ కేసుల్లో చర్యలకు అనుమతి కోరగా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. అదే అధికారి 2020లో రూ.36 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెండోసారి చిక్కారని పద్మనాభరెడ్డి వివరించారు. అవినీతిపరులకు సచివాలయ అధికారులు కొమ్ము కాస్తున్నంత కాలం ఇలాగే జరుగుతుందన్నారు.

Updated Date - 2020-12-10T10:15:15+05:30 IST