రాష్ట్రంలో అర్హులైన మహిళలే లేరా?

ABN , First Publish Date - 2020-12-03T06:47:34+05:30 IST

రాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైర్‌పర్సన్‌ను నియమించాలని అక్టోబరులోనే చెప్పినా..

రాష్ట్రంలో అర్హులైన మహిళలే లేరా?

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నియమించడానికి అడ్డంకులేంటి? 

ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు

31లోగా చైర్‌పర్సన్‌ను నియమించండి

లేదంటే సీఎస్‌ హాజరు కావాలని ఆదేశం

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైర్‌పర్సన్‌ను నియమించాలని అక్టోబరులోనే చెప్పినా.. ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదని నిలదీసింది. సంబంధిత ఫైల్‌ ఎక్కడ నిలిచిపోయిందో చెప్పాలని ప్రశ్నించింది. మహిళా కమిషన్‌ నియామకానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అర్హురాలైన మహిళను గుర్తించలేకపోతున్నారా అని నిలదీసింది. ఈ నెలాఖరు నాటికి మహిళా కమిషన్‌ను నియమించాలని స్పష్టం చేసింది. లేని పక్షంలో ప్రభుత్వ ప్రధాన క్యార్యదర్శి కోర్టు ముందు హాజరు కావాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది.


రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవీ కాలం ముగిసి రెండేళ్లయినా కొత్త చైర్‌పర్సన్‌ను నియమించకపోవడాన్ని ప్రశ్నిస్తూ సామాజిక కార్యకర్త రేగులపాటి రమారావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మరోసారి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. రాష్ట్రంలో మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ లేకపోవడంతో మహిళలపై దాడులు పెరిగాయని, నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. కమిషన్‌ ముందు 46 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.


కోర్టు జోక్యం చేసుకుని మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌ను నియమించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వివరణ ఇస్తూ.. ప్రభుత్వం ఈ నెల 31లోగా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నియమిస్తుందని తెలిపారు. ఈ వివరణను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ‘మీరు చెప్పిన గడువులోగా నియమించకపోతే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది’ అని స్పష్టంచేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.


Updated Date - 2020-12-03T06:47:34+05:30 IST