తెలంగాణ పల్లెలు..దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2020-12-30T06:45:25+05:30 IST

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసించారు. గ్రామాల రూపురేఖలను పల్లె ప్రగతి కార్యక్రమాలు మార్చేస్తున్నాయని, తెలంగాణ పల్లెలు

తెలంగాణ పల్లెలు..దేశానికే ఆదర్శం

‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామాల రూపురేఖలు

గ్రామ పంచాయతీలకు నిధుల కొరత లేదు

విద్యావంతులు, యువకులైన సర్పంచ్‌లున్నారు 

మిగిలి ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలి

‘ఉపాధి హామీ’లో 

20 కోట్ల పనిదినాలు కల్పించే వీలు

పల్లెప్రగతిపై సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌


హైదరాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసించారు. గ్రామాల రూపురేఖలను పల్లె ప్రగతి కార్యక్రమాలు మార్చేస్తున్నాయని, తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో మిగిలిన కొద్దిపాటి పనులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమంపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత వెల్లివిరియాలన్న ప్రభుత్వ లక్ష్యం వంద శాతం నెరవేరుతున్నది. ఈ ఏడాది డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలకపోవడానికి పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలే కారణం. గ్రామ పంచాయతీలకు ఇప్పుడు నిధుల కొరత లేదు. అవసరమైన అధికారాలను కూడా ప్రభుత్వం ఇచ్చింది’’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలోని సర్పంచుల్లో త్యధికులు విద్యావంతులు, యువకులు కావడంతో చిత్తశుద్ధితో గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. ‘‘పల్లె ప్రగతిలో గ్రామాల్లో పచ్చదనం పెంచడానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పల్లె ప్రకృతివనం ఏర్పాటుకు రూ.5 లక్షల చొప్పున నిధులు, గ్రీన్‌ బడ్జెట్‌ కింద గ్రామ పంచాయతీ నిధుల్లో 10 శాతం నిధులు, ఉపాధి హామీ నిధులు అందుబాటులో ఉన్నాయి.


వీటిని మొక్కలు నాటి పెంచడానికి ఉపయోగించాలి’’ అని సీఎం అన్నారు. ఆవాస ప్రాంతాల్లోని ప్రకృతి వనాల్లో వాకింగ్‌ ట్రాక్‌లు, ఓపెన్‌ జిమ్‌లు, సిమెంటు బెంచీలు ఏర్పాటు చేయాల సూచించారు. 12,734 గ్రామాల్లో విలేజ్‌ కామన్‌ డంప్‌ యార్డుల ఏర్పాటు కోసం స్థలాలు గుర్తించి నిర్మాణం ప్రారంభించినట్ల్లు తెలిపారు. ఇక 12,738 చోట్ల వైకుంఠ ధామాల నిర్మాణం జరుగుతోందని, రాబోయే మూడు నెలల్లో అన్ని గ్రామాల్లో వీటి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావాలని అన్నారు. తెలంగాణ మొత్తాన్ని బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా మార్చాలన్నారు. ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా, ప్రజోపయోగ పనుల కోసం వినియోగించే రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని కేసీఆర్‌ అన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే రాష్ట్రంలో 14 కోట్ల పనిదినాలు కల్పించినట్లు, ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి 20 కోట్ల పనిదినాలు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సందీప్‌ సుల్తానియా, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


కాగా, నకిరేకల్‌, మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరందించే  ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి, పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ మంగళవారం అధికారులను ఆదేశించారు. 

Updated Date - 2020-12-30T06:45:25+05:30 IST