వీరయ్య పార్టీ మారడం లేదు

ABN , First Publish Date - 2020-06-22T09:25:49+05:30 IST

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆదివారం భేటీ అయ్యారు.

వీరయ్య పార్టీ మారడం లేదు

టీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం చేస్తోంది: భట్టి విక్రమార్క

ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇవ్వండి

కేసీఆర్‌కు ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి లేఖ 


మధిర/హైదరాబాద్‌, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆదివారం భేటీ అయ్యారు. వీరయ్య కాంగ్రె్‌సను వీడి టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వీరయ్య పార్టీ మారుతున్నారని వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఇద్దరు నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భట్టి ‘ఆంధ్రజ్యోతి’తో ఫోన్‌లో మాట్లాడుతూ ఇదంతా టీఆర్‌ఎస్‌ ఆడుతున్న మైండ్‌ గేమ్‌ అని చెప్పారు. వీరయ్య పార్టీ మారుతున్నారంటూ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కుక్కతోక వంకర అన్న చందంగా టీఆర్‌ఎస్‌ బుద్ధి ఉందని ధ్వజమెత్తారు. ఓ వైపు ప్రజలు కరోనాతో ఇబ్బందులు పడుతుంటే.. టీఆర్‌ఎస్‌ పార్టీ దుష్ప్రచారాలు చేస్తూ సిగ్గుచేటు రాజకీయాలు చేస్తోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.


రైతుబంధు పథకాన్ని ఆంక్షలు లేకుండా అమలు చేసి, అన్నదాతలకు నిర్మాణాత్మకంగా సాయం అందించి రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఆదివారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసినట్టుగా సబ్సిడీపై విత్తనాలు అందించాలని, రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసి రైతులకు బాసటగా నిలవాలని కోరారు. స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక పంట రుణాలపై ఇచ్చే వడ్డీ రాయితీలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను ప్రోత్సహించే బదులు ప్రభుత్వం కేవలం రైస్‌మిల్లర్ల సూచనల మేరకు సన్న వరి రకాలను మాత్రమే సాగు చేయాలని సూచించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం సన్నరకాలకు రూ.2500 చొప్పున కొనుగోలు చేయడానికి స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. రెవెన్యూ అధికారుల అవినీతి, అక్రమాల వల్లనే రాష్ట్రంలో పేద రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అలిండియా కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి ఆరోపించారు.


రెవెన్యూ ప్రక్షాళన అదనుగా అధికారులు అవినీతికి పాల్పడతున్నారని ఆయన విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గం పామెల్‌ గ్రామంలో దళిత రైతు అంతయ్య జూన్‌ 17న ఆత్మహత్య చేసుకున్నాడని, నిన్న పెద్దపల్లి జిల్లా రెడ్డిపల్లికి చెందిన రాజిరెడ్డి రెవెన్యూ అధికారుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని కోదండరెడ్డి పేర్కొన్నారు. పేద రైతుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రైతుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. రెవెన్యూ అంశాలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-06-22T09:25:49+05:30 IST