సీఎంది మూర్ఖత్వం

ABN , First Publish Date - 2020-05-09T10:15:26+05:30 IST

సీఎం కేసీఆర్‌ మూర్ఖపు ముఖ్యమంత్రి. ఆయన సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ మండిపడ్డారు. ప్రతిదానికి కేంద్రాన్ని నిందించడం, అబద్ధాలు చెప్పి

సీఎంది మూర్ఖత్వం

హైదరాబాద్‌, మే 8(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం కేసీఆర్‌ మూర్ఖపు ముఖ్యమంత్రి. ఆయన సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ మండిపడ్డారు. ప్రతిదానికి కేంద్రాన్ని నిందించడం, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్ప ఆయన చేసిందేమీ లేదన్నారు. సీఎం వైఖరి బావిలో కప్పలా ఉందని, తానే పోటుగాడినన్నట్లుగా ఆయన వ్యవహరిస్తారని ఎద్దేవా చేశారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి సంజయ్‌.. ఓ యాప్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఽధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పాత్రను తాము మధ్యవర్తిత్వం అంటామని, సీఎం కేసీఆర్‌ భాషలో అది బ్రోకరిజం అని స్పష్టం చేశారు.  తాను ధాన్యం కొనుగోలు చేయకపోతే మీ బతుకెంత? అంటూ రైతులను కేసీఆర్‌ అవమానించారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వమే దళారీగా మారి రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ జోకర్‌గా మారారని, దొంగ ముచ్చట్లతో అబద్ధాలనే నిజాలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. లాక్‌డౌన్‌తో బోర్‌కొట్టి, ప్రజలు టైంపాస్‌ కోసం కేసీఆర్‌ ప్రసంగం కోసం ఎదురుచూశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఆరేళ్లుగా బయటకు రాలేదని, ఆయన క్వారంటైన్‌ ముఖ్యమంత్రి అని విమర్శించారు. రెండు రోజుల కిందట నిర్వహించిన మీడియా సమావేశంలో 38 తిట్లు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోందన్నారు. ‘‘కరోనా పరీక్షలు చేయడంలో మీకున్న అభ్యంతరాలు ఏమిటి? ధాన్యం సేకరణపై ప్రతిరోజు బులెటిన్‌ ఎందుకు విడుదల చేయరు?’’ అని నిలదీశారు.


శ్వేతపత్రం విడుదల చేయాలి

కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కరోనా సహాయక నిధులను, వలస కార్మికులకు కోసం విడుదల చేసిన నిధులను టీఆర్‌ఎస్‌ కేడర్‌ తమ జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. కరోనా పరీక్షలు నిర్వహించకుండా, సీఎం కేసీఆర్‌ ప్రజల చావు కోరుకుంటున్నారన్నారు. కాగా, పాతబస్తీలో దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2020-05-09T10:15:26+05:30 IST