నిండుకుండలా శ్రీరామ సాగర్‌

ABN , First Publish Date - 2020-09-13T06:45:04+05:30 IST

వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది.

నిండుకుండలా శ్రీరామ సాగర్‌

ప్రాజెక్టుకు 26 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

సాగర్‌ నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల 


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరామ సాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో శ్రీరామసాగర్‌కు 26,117 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90టీఎంసీలు) కాగా, శనివారం సాయంత్రానికి 1090.6 (88.11టీఎంసీలు) అడుగుల నీటి నిల్వ ఉంది.  రిజర్వాయర్‌ నుంచి నాలుగు కాల్వలకు నీటిని వదులుతున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రంలో 19.8 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తున్నారు. 


జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 1.23 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 12 గేట్ల ద్వారా 71,462 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 9.5 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. 34,422 క్యూసెక్కుల నీటితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల నుంచి మొత్తం 1,08,613 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉంది. 


శ్రీశైలం జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగింది. జూరాల నుంచి 71,412 క్యూసెక్కులు, పవర్‌హౌస్‌ నుంచి 34,422, సుంకేసుల నుంచి 53,512 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. రిజర్వాయర్‌ ఐదు గేట్లు ఎత్తి లక్షా 39,230 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జుసాగర్‌కు వరద ప్రవాహం తగ్గింది.

శుక్రవారం సాగర్‌ 14 గేట్ల ద్వారా నీటిని వదలిన అధికారులు శనివారం సాయంత్రానికి నాలుగు గేట్లకు తగ్గించారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0405 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.60 అడుగుల (310.8498 టీఎంసీలుగా) మేర నీరుంది. 1,27,789 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తుండగా, 1,00,114 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో ఉంది.


Updated Date - 2020-09-13T06:45:04+05:30 IST