కరీంనగర్‌లో రెండో దశ!
ABN , First Publish Date - 2020-03-24T10:22:53+05:30 IST
కరీంనగర్‌లో కరోనా ప్రమాద ఘంటికలు మోగించింది. నగరంలో రెండో దశకు చేరింది. ఇండోనేషియా మత ప్రచారకులతో సన్నిహితంగా మెలిగిన స్థానికుడు

నగరవాసికి కరోనా పాజిటివ్
ఇండోనేషియా మత ప్రచారకులతో కలిసి తిరిగిన స్థానికుడికి వైరస్
జిల్లాలో తొమ్మిదికి పెరిగిన కేసులు
కరీంనగర్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్‌లో కరోనా ప్రమాద ఘంటికలు మోగించింది. నగరంలో రెండో దశకు చేరింది. ఇండోనేషియా మత ప్రచారకులతో సన్నిహితంగా మెలిగిన స్థానికుడు ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతనిని హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. దాంతో, మొత్తం కేసుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. సోమవారం కొత్తగా మరో నలుగురు కరోనా లక్షణాలతో అధికారులను సంప్రదించడంతో ఐసొలేషన్ వార్డుకు పంపించారు. ఇండోనేషియా మత ప్రచారకులతో సన్నిహితంగా మెలిగిన 72 మందిని జిల్లా అధికార యంత్రాంగం గుర్తించింది. వీరిలో సగం మంది ఇప్పటికే ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉండగా..
మిగతా వారు తాము ఆరోగ్యంగానే ఉన్నామని, ఇంట్లోనే ఉంటామని చెప్పడంతో హోం క్వారంటైన్‌కు అనుమతించారు. కరోనా రెండో దశకు చేరుకోవడంతో మత ప్రచారకులు బస చేసిన, తిరిగిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని బార్‌కేడింగ్ చేశారు. ఆ ప్రాంతం నుంచి ఒక్క మనిషిని కూడా బయటకు రానివ్వకుండా, అక్కడికి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేసి పోలీసు పహరా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ అవసరమైన రేషన్, కూరగాయలు, పాలు అందిస్తున్నారు.
కలెక్టర్ శశాంక, పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఇతర అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించారు. కరోనా తీవ్రతను, దుష్పలితాలను వివరించారు. ప్రాణాలను కాపాడుకునేందుకు మత ప్రచారకులతో కలిసి తిరిగిన వారు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వెల్లడించాలని కోరారు. నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వివిధ దేశాలు వెళ్లి.. రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి జిల్లాకు 371 మంది వచ్చారు. వారి చేతులపై స్టాంపులు వేశారు.